హీరాగోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈడీ అధికారులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-22 02:34:05  IST  )

హీరాగోల్డ్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హీరాగోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న ఈడీ అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: హీరాగోల్డ్ (Heera Gold) మల్టీ-క్రోర్ ఇన్వెస్ట్‌మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నౌహీరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఎట్టకేలకు ఇవాళ అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి అజ్ఞాతంలో ఉంటున్న ఆమెను హర్యానాలోని గుర్గావ్‌లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఫేక్ ఆధార్‌తో అజ్ఞాతవాసం

సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరక్కుండా నౌహీరా షేక్ పరారయ్యారు. గుర్గావ్‌లోని ఓ అద్దె నివాసంలో ఆమె నకిలీ పేరుతో, ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డు, ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి మారువేషంలో తలదాచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది. హ్యూమన్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టిన ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం ఇవాళ ఉదయం ఆమె ఉన్న లొకేషన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుంది. గుర్గావ్‌లో అరెస్ట్ చేసిన అనంతరం నౌహీరా షేక్‌ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత బేగంపేట కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించనున్నారు. కాగా, నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించినందుకు గానూ గుర్గావ్ పోలీసుల చేత ఆమెపై విడిగా మరో ఫోర్జరీ కేసు నమోదు చేయించేందుకు కూడా ఈడీ సిద్ధమవుతోంది.

రూ.5,000 కోట్ల భారీ కుంభకోణం..

హీరా గ్రూప్ సంస్థల పేరిట ఏడాదికి 36 శాతం చొప్పున భారీ లాభాలు ఇస్తామని నమ్మించి రూ.లక్షలు అమాయక ప్రజల నుంచి సుమారు రూ.5,978 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు నౌహీరా షేక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈడీ ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద హీరా గ్రూప్‌నకు చెందిన రూ.400 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది.

Next Story