బెంగళూరులో భారీ వర్షాలు.. ప్రహరీ గోడ కూలి ఏడుగురు మృతి

by Kema Shiva Kumar |

బెంగళూరులో కురిసిన భారీ వర్షాలకు ఓ ఆసుపత్రి ప్రహరీ గోడ కూలి ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మరణించారు.

బెంగళూరులో భారీ వర్షాలు.. ప్రహరీ గోడ కూలి ఏడుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షాల ధాటికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో కొన్నిచోట్ల ప్రాణనష్టం సంభవించింది. ఒక ప్రైవేటు ఆసుపత్రి ప్రహరీ గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఏడుగురు మృతి చెందడం నగరంలో విషాదం నింపింది. నగరంలోని కళ్యాణ్ నగర్, బనసవాడి, ఆర్టీ నగర్, ఎంజీ రోడ్, శివాజీనగర్ వంటి ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి ఓ ఆసుపత్రి ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ సమయంలో గోడ పక్కనే ఉన్న ఏడుగురు దాని కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండటం అందరినీ కలచివేస్తోంది.

పోలీసుల సహాయక చర్యలు.. సీఎం పరామర్శ

ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన మరికొందరిని తక్షణమే చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) స్పందించి ప్రమాద స్థలాన్ని సందర్శించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story