గుజరాత్ లో రైలు పట్టాలపై భారీ కడ్డీలు.. నిందితుల అరెస్ట్

by M.Rajitha |
గుజరాత్ లో రైలు పట్టాలపై భారీ కడ్డీలు.. నిందితుల అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : రైలు పట్టాలకు అడ్డంగా భారీ ఇనుప కడ్డీ పెట్టిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 25న బొటాద్ జిల్లాలో దుండగులు రైలు పట్టాలపై ఐదడుగుల ఇనుప కడ్డీలు ఉంచగా.. లోకోపైలట్ ముందు జాగ్రత్తతో అటుగా వస్తున్న ప్యాసింజర్ రైలుకు ఘోర ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో మంగళవారం పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. పోలీసుల వివరాల ప్రకారం.. బొటాద్ లో కూలి పనులు చేసుకునే రమేష్ సాలియా, జయేశ్ బవిలియా అనే ఇద్దరు యువకులు, త్వరగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రైలులో చోరీకి ప్లాన్ వేసి, పట్టాలపై పొడవైన ఇనుప కడ్డీని పెట్టారు. రైలు పట్టాలు తప్పితే ప్యాసింజర్ల వద్ద ఉన్న డబ్బు, బంగారు నగలు దోచుకోవాలని అనుకున్నారు. అయితే అటుగా వస్తున్న ఓఖా-భావనగర్ ప్యాసింజర్ యొక్క లోకోపైలట్ దూరం నుంచే ఇనుప కడ్డీలను గుర్తించి బ్రేకులు వేసి, వందల మంది ప్రాణాలను కాపాడారు. అనంతరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలించి.. నేడు వారిని అరెస్ట్ చేశారు. దుండగుల చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపిన పోలీసులు.. ఈ ఘటనపై ఎన్ఐఏ, ఏటీఎస్ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed