రూ.20 వేలు లంచం డిమాండ్.. ACBకి చిక్కిన గ్రౌండ్ వాటర్ ఆఫీసర్, ఆపరేటర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-15 12:21:37  IST  )

బోరుబావి డ్రిల్లింగ్ రిగ్ అనుమతి కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేసిన ఇద్దరిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రూ.20 వేలు లంచం డిమాండ్.. ACBకి చిక్కిన గ్రౌండ్ వాటర్ ఆఫీసర్, ఆపరేటర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ (ACB) అధికారులు విస్తృతంగా దాడులు చేసి లంచాలు తింటున్న అధికారుల పని పడుతున్నా.. అక్రమార్జనకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. తాజాగా. సూర్యాపేట జిల్లా భూగర్భ జలాల శాఖ కార్యాలయంలో ఇవాళ ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ మేగావత్ బాలు (Megavath Balu), ఔట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోసనోజు వెంకటేశ్వర్ల (Kosanoju Venkateshwarlu)ను అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ ఫిర్యాదుదారుడు తన బోరుబావి డ్రిల్లింగ్ రిగ్‌ (Borewell Drilling Rig) అనుమతి కోసం గ్రౌండ్ వాటర్ శాఖను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే అతడికి జరిమానాలు విధించకుండా, రిగ్‌ను సీజ్ చేయకుండా ఉండేలా చూసేందుకు జిల్లా అధికారి మేగావత్ బాలు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. ఆ లంచం మొత్తాన్ని తన ఆఫీసులోని ఔట్‌సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లుకు ఇవ్వాల్సిందిగా బాలు సూచించారు.

ఈ క్రమంలోనే బాధితుడు ఏసీబీ నల్గొండ రేంజ్ అధికారులను ఆశ్రయించారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇవాళ డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేశ్వర్లు బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. లంచం సొమ్మును వెంకటేశ్వర్లు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. లంచం డిమాండ్ చేసి, అక్రమంగా డబ్బులు వసూలు చేసినందుకు గానూ నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అనంతరం వారిని నాంపల్లిలోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించనున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.

Next Story