TG: మూడు రోజుల్లో వివాహం.. అంతలోనే అనంతలోకాలకు

by Gantepaka Srikanth |

మరో మూడు రోజుల్లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఆ యువకుడిని విధి వంచించింది.

TG: మూడు రోజుల్లో వివాహం.. అంతలోనే అనంతలోకాలకు
X

దిశ, చిన్నశంకరంపేట: మరో మూడు రోజుల్లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఆ యువకుడిని విధి వంచించింది. పెళ్లి పనుల్లో బిజీగా ఉంటూ, బంధుమిత్రులను ఆహ్వానిస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆ ఇంట తీరని విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జంగరాయి గ్రామానికి చెందిన వరప్రసాద్(30) తన వివాహ పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, అంబాజీపేట గ్రామ శివారులోకి రాగానే ఒక్కసారిగా రోడ్డుపైకి కుక్క అడ్డం వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపు తప్పి వేగంగా రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో ఉన్న యువకుడిని చూసి గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.

పెళ్లి ఇంట్లో మిన్నంటిన రోదనలు..

మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండటంతో ఆ ఇంట్లో అందరూ సంబరాల్లో మునిగిపోయారు. సందడిగా ఉన్న ఇంట్లో యువకుడి మరణవార్త పిడుగులా పడింది. పెళ్లి కుమారుడు ఇక లేడన్న వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పెళ్లి పందిరి కింద వాళ్లు పడుతున్న ఆర్తనాదాలు చూసి గ్రామమంతా కంటతడి పెట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనతో అంబాజీపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story