ఆయుర్వేద మూలికా వైద్యం పేరుతో విశాఖలో ఘరానా మోసం

by Ramesh Naini |

ఆయుర్వేద మూలికా వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

ఆయుర్వేద మూలికా వైద్యం పేరుతో విశాఖలో ఘరానా మోసం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆయుర్వేద మూలికా వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను తాజాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వృద్ధులు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిని టార్గెట్‌గా చేసుకుని ఈ ముఠా కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.బస్టాప్‌లు, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తూ ‘ఏ రోగమైనా శస్త్రచికిత్స లేకుండా, నొప్పి లేకుండా పూర్తిగా నయం చేస్తాం’ అంటూ మాయమాటలు చెప్పి బాధితులను ట్రాప్ చేసినట్లు సమాచారం. అనంతరం వారిని రామా టాకీస్ ప్రాంతంలో ఉన్న ప్రకృతి ఆయుర్వేద సెంటర్‌కు తీసుకువెళ్లి చికిత్స పేరుతో భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆరు నెలల్లో కచ్చితంగా ఫలితం

లైసెన్స్ లేకుండా నకిలీ తైలాలు, చూర్ణాలు, మూలికలతో వైద్యం చేస్తున్న ఈ ముఠా, ‘ఆరు నెలల తర్వాత కచ్చితంగా ఫలితం వస్తుంది’ అంటూ నమ్మబలికేది.. నయం కాకపోతే 70 శాతం ఫీజు తిరిగి ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించి బాధితులను మరింత మభ్యపెట్టినట్లు దర్యాప్తులో తేలింది. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు ప్రకృతి ఆయుర్వేద సెంటర్‌పై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కర్ణాటకకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నకిలీ తైలాలు, చూర్ణాలు, మూలికలను స్వాధీనం చేసుకున్నారు.

Next Story