మంత్రి ఉత్తమ్ పేరు చెప్పి బురిడీ.. రూ.1.70 కోట్లు దోచుకున్న కేటుగాడు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-27 05:19:00  IST  )

తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు చెప్పి ఓ కేటుగాడు ఏకంగా రూ.1.70 కోట్లు కొట్టేశాడు.

మంత్రి ఉత్తమ్ పేరు చెప్పి బురిడీ.. రూ.1.70 కోట్లు దోచుకున్న కేటుగాడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి కోటీశ్వరులు, వ్యాపారవేత్తలను టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తాజాగా తాజాగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) పేరు చెప్పి ఓ ప్రముఖ ఇన్‌ఫ్రా సంస్థ నుంచి ఏకంగా రూ.1.70 కోట్లు వసూలు చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

పెద్ద ప్రాజెక్ట్ ఇప్పిస్తానని చెప్పి బురిడీ..

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన గ్రీన్ మెట్రో ఇన్‌ఫ్రాటెక్ (Green Metro Infratech) సంస్థ దుండిగల్ ప్రాంతంలో ఓ పెద్ద ప్రాజెక్టు కోసం ప్రయత్నిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పురిమెట్ల బంగారు యాదవ్ (Bangaru Yadav) అనే వ్యక్తి, సదరు సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్‌ (Ashok)ను కలిశాడు. తనకు మంత్రి ఉత్తమ్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో అశోక్ నుంచి బంగారు యాదవ్ వివిధ విడతల్లో రూ.1.70 కోట్ల నగదుతో పాటు అల్కజర్ కారు, ఖరీదైన ఐఫోన్ తీసుకున్నాడు. అయితే, డబ్బు తీసుకున్న తర్వాత సుమారు 18 నెలల పాటు నిందితుడు బాధితుడు అశోక్‌కు బంగారు యాదవ్ మాయమాటలు చెబుతూ వచ్చాడు. ఎంతకీ ప్రాజెక్టు రాకపోవడం, అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించిన బొడ్డు అశోక్ జూబ్లీహిల్స్ (Jubilee Hills) పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడు పురిమెట్ల బంగారు యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story