రాహుల్ గాంధీ సెక్రటరీని అంటూ మోసం.. రూ.కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు

by Kema Shiva Kumar |

రాహుల్ గాంధీ పీఏ కనిష్క్ సింగ్ పేరుతో రాజకీయ నేతల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన కేటుగాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

రాహుల్ గాంధీ సెక్రటరీని అంటూ మోసం.. రూ.కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు
X

దిశ, వెబ్‌డెస్క్: పొలిటికల్ లీడర్లే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పర్సనల్ సెక్రటరీని అంటూ నమ్మించి రూ.లక్షలు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర మోసగాడిని డెహ్రాడూన్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన గౌరవ్ కుమార్ (Gaurav Kumar) అనే నిందితుడిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆమె ఫిర్యాదుతో బయటపడిన వ్యవహారం

ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలు భావనా పాండే (Bhavana Pandey) ఇచ్చిన ఫిర్యాదుతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ సెక్రటరీ కనిష్క్ సింగ్ పేరుతో ఆమెను సంప్రదించిన గౌరవ్ కుమార్, పార్టీలో ఉన్నత పదవి ఇప్పిస్తానని నమ్మబలికాడు. గత నెలలో ఆమె నివాసానికి తన అనుచరుడిని పంపి రూ.25 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యాడు. మే 3న ఆమె రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ట్రూ కాలర్‌లో ఫేక్ ప్రొఫైల్స్..

అయితే, నిందితుడు గౌరవ్ కుమార్ అత్యంత తెలివిగా మోసాలకు పాల్పడుతన్నాడు. ట్రూ కాలర్ (Truecaller) వంటి యాప్స్‌లో ‘కనిష్క్ సింగ్’ రాహుల్ గాంధీ పీఏ పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఈజీగా నమ్మిస్తున్నట్లగా పోలీసులు గుర్తించారు. మందుగా పొలిటికల్ వెబ్‌సైట్ల ద్వారా టికెట్ ఆశావహులు, పదవులు కోరుకునే నేతల వివరాలు సేకరించేవాడు. ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లోని నేతలే లక్ష్యంగా వల విసిరాడు. ఇందులో భాగంగా జైపూర్‌లో ఇద్దరు నేతల నుంచి వరుసగా రూ.1.90 కోట్లు, రూ.12 లక్షల వరకు వసూలు చేశాడు. పాట్నాకు చెందిన మరోనేత నుంచి రూ.3 లక్షలు కాజేశాడు.

పరారీలో ముగ్గురు అనుచరులు..

ఈ మొత్తం స్కామ్‌లో గౌరవ్ కుమార్‌కు సహకరించిన ఛజ్జు, రజత్ మాడ, మణిందర్ సింగ్ కాలు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, డేటా డాంగిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరువు పోతుందన్న భయంతో చాలామంది ప్రముఖులు బయటకురావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం బీఎన్ఎస్ యాక్ట్‌ (BNS Act)లోని సెక్షన్ 318 (4) కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Next Story