గురువులే రాక్షసులై.. ఏడవ తరగతి విద్యార్థినిపై స్కూల్లో ఏడాదిగా గ్యాంగ్ రేప్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-22 06:36:46  IST  )

చదువు చెప్పాల్సిన గురువులే ఆమె జీవితాన్ని విచ్ఛిన్నం చేశారు. తమలోని కామాన్ని నిద్రలేపి విద్యార్థినిపై ఏడాదికాలంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

గురువులే రాక్షసులై.. ఏడవ తరగతి విద్యార్థినిపై స్కూల్లో ఏడాదిగా గ్యాంగ్ రేప్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్షరాలు నేర్పించాల్సిన గురువులే రాక్షసులుగా మారారు. విద్య నేర్చుకోవడానికి వచ్చిన ఒక మైనర్ బాలికపై ఏకంగా ఏడాది కాలంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు చెందిన నలుగురు టీచర్లు, ఒక ప్యూన్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఏడో తరగతి చదువుతున్న బాధిత బాలిక గత నెలలో తన తల్లికి జరిగిన ఘోరాన్ని వివరించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా నిందితులు తనపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడుతున్నారని, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని ఆమె వాపోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 18న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC)ని ఆశ్రయించారు.

సీడబ్ల్యూసీ ఫిర్యాదును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, పోక్సో (POCSO) చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేంద్ర పారా ఎస్పీ సిద్ధార్థ్ కటారియా నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు.. ఎఫ్ఐఆర్ లో పేరున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇది అత్యంత సున్నితమైన కేసు అని ఎస్పీ పేర్కొన్నారు. బాధిత బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామని, నిందితులను నేడు (ఆదివారం) కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను దర్యాప్తు చేసే స్పెషల్ టీమ్ సభ్యులను హెడ్ క్వార్టర్స్ నుంచి పంపించి ఈ కేసును నిశితంగా పర్యవేక్షిస్తున్నామని వివరించారు.

ఈ దారుణంలో మరో విస్తుపోయే నిజం బయటపడింది. నిందితులు చేస్తున్న ఘోరాన్ని అడ్డుకోవాల్సిన మరికొందరు ఉపాధ్యాయులు (ఒక మహిళా టీచర్‌తో సహా), ఈ విషయాన్ని బయటకు రాకుండా నిందితులకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. అయితే, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసిన తర్వాతే తమకు విషయం తెలిసిందని స్కూల్ ప్రిన్సిపాల్ పేర్కొంటున్నారు. విద్యార్థులకు పాఠాలు నేర్పి.. వారి జీవితాన్ని తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలోని టీచర్లే బాలికపై ఇంతటి దారుణానికి పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story