- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదంలో తాండూరు.. ఇందూరు మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కన్నుమూత
పెద్దేముల్ మండల సీనియర్ నాయకుడు, ఇందూరు గ్రామ మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్ (42) ఆదివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

దిశ, పెద్దేముల్ / తాండూరు : పెద్దేముల్ మండల సీనియర్ నాయకుడు, ఇందూరు గ్రామ మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్ (42) ఆదివారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయన పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే తాండూరు నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
భారీ ర్యాలీగా హైదరాబాద్ నుండి తాండూర్ కు..
హైదరాబాద్ నుండి ప్రవీణ్ కుమార్ మృతదేహం తాండూరుకు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. "పటేల్ ప్రవీణ్ అమర్ రహే" అంటూ నినాదాలు చేస్తూ అంబులెన్స్ వెంట వందలాది మంది ర్యాలీగా వెళ్లారు. తమ అభిమాన నాయకుడిని కడసారి చూసేందుకు ప్రజలు రోడ్ల పైకి రావడంతో తాండూరు పట్టణం జనసంద్రమైంది.
శోకసంద్రంలో ఇందూరు గ్రామం
ప్రవీణ్ మరణంతో ఆయన స్వగ్రామమైన ఇందూరుతో పాటు నియోజకవర్గమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యుల రోదనలు చూసి అక్కడికి వచ్చిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. నియోజకవర్గ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన ప్రవీణ్, అందరితో కలుపుగోలుగా ఉండేవారని స్థానికులు గుర్తు చేసుకున్నారు.
రాజకీయ ప్రముఖుల నివాళులు
పటేల్ ప్రవీణ్ భౌతికకాయానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వేరు వేరుగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రవీణ్ మరణం నియోజకవర్గానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరికొందరు ముఖ్య నాయకులు కూడా ప్రవీణ్ నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.






