వివాహేత‌ర సంబంధం.. జంట ఆత్మ‌హ‌త్య

by Ratna Kumari |   (  Updated:2026-04-16 14:12:00  IST  )

వివాహేతర నేపథ్యంలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి దేవాలయ పరిసర ప్రాంతాలలో చోటు చేసుకుంది.

వివాహేత‌ర సంబంధం.. జంట ఆత్మ‌హ‌త్య
X

దిశ, చిన్న చింతకుంట/ధన్వాడ : వివాహేతర నేపథ్యంలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి దేవాలయ పరిసర ప్రాంతాలలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారమం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ (30), అరుణ (25) కు అది వరకే వేరు వేరు వ్యక్తులతో వివాహం జరిగింది. ప్రవీణ్ దంపతులకు ఇద్దరు సంతానం, అరుణ దంపతుల‌కు ఇద్దరు సంతానం. హాయిగా ఎవరి జీవిత భాగస్వామితో వారు హాయిగా సంసారం చేసుకోవాల్సింది పోయి .. పరిచయం పెంచుకొని.. ఏడాదిన్నర క్రితం నుంచి ఇరువురి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు కలిసి జీవించాలి అనే ఉద్దేశంతో గతంలో ఒకసారి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు వారిని మందలించి గ్రామానికి తీసుకొచ్చి హితబోధ చేశారు.

కొన్ని రోజులపాటు ఎవరి కుటుంబాలలో వారు ఉన్నప్పటికీ.. మళ్లీ వారు ఇరువురు కలిసి ఈనెల 13న ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఇబ్బందులు పడుతూ కలిసి జీవించలేము అనుకున్నారో.. ఇతర కారణాల వల్ల నో కానీ ఇరువురు చిన్నచింతకుంట మండలం కురుమూర్తి దేవాలయ పరిసర ప్రాంతానికి అదే రోజు చేరుకున్నారు. ఈనెల 14 వ తేదీన వీరి మిస్సింగ్ కు సంబంధించి మరికల్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెతుక్కుంటూ ఈనెల 15న చేరుకున్నారు. అప్పటికే అరుణ మృతి చెంది ఎండ వేడిమికి కుళ్ళిపోయిన స్థితికి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న ప్రవీణ్ ని హుటాహుటిన చిన్న చింతకుంట ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. సంఘటన స్థలంలో ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన పురుగుల మందు డబ్బాలను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు భూత్పూర్ సీఐ రామకృష్ణ పర్యవేక్షణ లో చిన్న చింతకుంట ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story