గుర్తుతెలియని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య

by Taduka Kalyani |

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం పర్సనంబాల గ్రామానికి చెందిన మసాడే సోమయ్య (65) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు.

గుర్తుతెలియని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య
X

దిశ,రెబ్బెన : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం పర్సనంబాల గ్రామానికి చెందిన మసాడే సోమయ్య (65) అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య కరుణాబాయి ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం సోమయ్య తన భార్యతో కలిసి నంబాల గ్రామంలోని చిన్న కుమార్తె సుజాత ఇంటికి వెళ్లాడు. హైదరాబాద్‌లో ఉంటున్న పెద్ద కుమార్తె లక్ష్మి కూడా అక్కడికి రావడంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నారు. శుక్రవారం ఉదయం లక్ష్మిని రైలెక్కించేందుకు సోమయ్య, అతని భార్య, ఇద్దరు కుమార్తెలు ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ఈ సమయంలో చాయ్ తాగి వస్తానని చెప్పి సోమయ్య బస్టాండ్ వైపు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటకృష్ణతో పాటు ఆర్‌పీఎఫ్ (రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్) పోలీసులు సందర్శించి పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ఆధారాలు సేకరించగా, రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Next Story