పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

by Taduka Kalyani |

పురుగుల మందు తాగి ఓ వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది

పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య
X

దిశ, శంషాబాద్: పురుగుల మందు తాగి ఓ వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చింతల్ గ్రామానికి చెందిన జొన్నాడ నారాయణ (78) సుమారు 20 రోజుల క్రితం ఇంటి వద్ద కాలుజారి పడడంతో ఎడమ కాలు విరిగింది. అప్పటి నుంచి నడవలేని స్థితిలో ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం నిద్రపోయిన నారాయణ, అర్ధరాత్రి సమయంలో పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. అతని వద్ద నుంచి ‘అజిల్’ అనే గడ్డి మందు సీసా లభ్యమైంది. వెంటనే కుటుంబ సభ్యులు శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం నారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాలు విరగడంతో మంచానికే పరిమితమై, తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి కారణంగా మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతుడి మరణంపై ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఈ మేరకు శంషాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story