మాటల్లో పెట్టి కొట్టేశాడు..! వృద్ధురాలి నుండి మూడు తులాల పుస్తెల తాడు చోరీ

by Bhanu |

కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్లిన వృద్ధ దంపతులను మాటల్లో పెట్టి మూడు తులాల బంగారు పుస్తెల తాడు కొట్టేసిన ఘటన నర్సంపేట పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

మాటల్లో పెట్టి కొట్టేశాడు..! వృద్ధురాలి నుండి మూడు తులాల పుస్తెల తాడు చోరీ
X

దిశ, నర్సంపేట: కూరగాయల కోసం మార్కెట్ కి వెళ్లిన వృద్ధ దంపతులను మాటల్లో పెట్టి మూడు తులాల బంగారు పుస్తెల తాడు కొట్టేసిన ఘటన నర్సంపేట పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. నర్సంపేట పట్టణంలోని మార్కండేయ కాలనీకి చెందిన మాటేటి సరోజన(70), సర్వేశం(75) దంపతులు ఆదివారం మధ్యాహ్నం స్థానిక అంగడి సెంటర్లో కూరగాయలు కొనేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆటో దిగుతుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మీకోసం వెతుకుతున్నాను అని పాత ఇంటికి వెళ్ళొచ్చాను అంటూ మాటలు కలిపాడు.


పెన్షన్ ఇప్పిస్తా అంటూ సర్ వాళ్ళు స్థానిక వాసవి కల్యాణ మండపం దగ్గర మీటింగ్ పెట్టారు అంటూ నమ్మించాడు. ఇద్దరినీ అక్కడికి తీసుకెళ్లాడు. సర్వేశాన్ని నమ్మించి ఇంటికి వెళ్లి గ్జిరాక్స్ కాపీలు తీసుకురావాలని నచ్చజెప్పి పంపినట్లు తెలుస్తోంది. అనంతరం సరోజనను అక్కడ నుండి బస్టాండ్ సమీపంలోని మోడల్ పాఠశాల దగ్గరకు తీసుకెళ్లినట్లు సమాచారం.

అనంతరం ఫోటో తీయాలని చెప్పి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడును తీసుకున్నాడు. పక్కనే ఉన్న షాపులో పెన్షన్ ఫారం తీసుకురమ్మని వచ్చేలోపు అక్కడ నుండి సదరు వ్యక్తి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మోసపోయినట్లు గుర్తించిన వృద్ధ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు.

Next Story