పండుగపూట మరో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం

by Gantepaka Srikanth |

శ్రీరామ నవమి పర్వదినాన పెను విషాదం చోటుచేసుకుంది.

పండుగపూట మరో ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామ నవమి పర్వదినాన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాన్పూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. డోర్మా పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక భారీ ట్రాలీని వేగంగా వచ్చిన పికప్ వ్యాన్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. పికప్ వ్యాన్‌లో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఫతేపూర్ జిల్లా మల్వా ప్రాంతంలోని బడోఖర్ గ్రామానికి చెందిన వీరందరూ శ్రీరామ నవమి సందర్భంగా శీతలా ధామ్ దర్శనం కోసం పికప్ వ్యాన్ అద్దెకు తీసుకుని వెళ్లారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాద తీవ్రత..

డీకొన్న వేగానికి పికప్ వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. వాహనంలో ఉన్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది నాలుగు అంబులెన్స్‌లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఎనిమిది మంది మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులకు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై కొంతసేపు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story