ED Raids: టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్.. మాజీ మంత్రి ఇంట్లో ఈడీ రెయిడ్స్

by Kema Shiva Kumar |

పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఈడీ దూకుడు పెంచింది. మాజీ మంత్రి పార్థా ఛటర్జీ నివాసంలో ఇవాళ తాజాగా సోదాలు నిర్వహించింది.

ED Raids: టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్.. మాజీ మంత్రి ఇంట్లో ఈడీ రెయిడ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (SSC Scam) మరోసారి తెరపైకి వచ్చింది. ఇవాళ ఉదయం మాజీ విద్యాశాఖ మంత్రి, సస్పెండ్ అయిన టీఎంసీ నేత పార్థా ఛటర్జీ (Partha Chatterjee) నివాసంతో పాటు పలువురి నివాసాలపై ఈడీ అధికారులు ఆకస్మికంగా దాడులు చేశారు. అయితే, టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పార్థా ఛటర్జీకి మూడుసార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, అనారోగ్య కారణాలు చూపుతూ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఇవాళ ఉదయం కోల్‌కతాలోని ఆయన ‘నకతలా’ నివాసానికి ఈడీ బృందం చేరుకుంది. భారీగా కేంద్ర బలగాల మోహరింపు మధ్య ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

పార్థా ఛటర్జీ నివాసంతో పాటు, ఈ కేసులో మధ్యవర్తిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైల్లో ఉన్న ప్రసన్న కుమార్ రాయ్ (Prasanna Kumar Roy) నివాసంలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (2026) సమీపిస్తున్న తరుణంలో ఈ దాడులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2022లో ఈ కుంభకోణంలో అరెస్ట్ అయిన పార్థా ఛటర్జీ, ఇటీవల సుప్రీంకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ పొంది జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, ప్రైమరీ టీచర్ల నియామకం, గ్రూప్-సీ, డీ స్టాఫ్ రిక్రూట్‌మెంట్లలో అక్రమాలకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది. 2022లో ఈడీ సోదాల్లో పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో రూ.50 కోట్లకు పైగా నగదు, భారీగా బంగారం లభించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణం కారణంగా దాదాపు 26 వేల మంది ఉద్యోగాలను సుప్రీంకోర్టు రద్దు చేయడం అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

Next Story