డ్రగ్స్ దందాలో పోలీసు ఉన్నతాధికారి సుపుత్రుడు.. గుర్తించిన ఈగల్ టీమ్

by Kema Shiva Kumar |

హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ అధికారి (ఓఎస్డీ) కొడుకు పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు.

డ్రగ్స్ దందాలో పోలీసు ఉన్నతాధికారి సుపుత్రుడు.. గుర్తించిన ఈగల్ టీమ్
X

దిశ, సిటీ క్రైం: హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ అధికారి(ఓఎస్డీ) కొడుకు పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్ట్ తర్వాత పోలీసులు ఆ నెట్ వర్క్‌పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబీ అధికారి కొడుకు పాత్ర తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారం ఈగిల్ అధికారులను షాక్‌కు గురి చేసింది. ఈ పోలీసు అధికారి కొడుకు పాత్రపై ఆరా తీస్తున్న క్రమంలో మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. 2024 సంవత్సరంలో ఎస్ఐబీ అధికారి కొడుకు ఓసారి దొరికినా పోలీసులు అతనిని అరెస్ట్ చేయకుండా జాప్యం చేశారనే విషయం కూడా ఈగిల్ అధికారులు గుర్తించారు. ఈ ఎస్ఐబీ పోలీస్ అధికారి ప్రస్తుతం ఓఎస్డీ‌గా ఎస్ఐబీ‌లోనే కొనసాగుతున్నారు. సదరు అధికారిని ఫోన్ టాపింగ్ కేసులో ప్రాథమికంగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత అతను అప్రూవర్‌గా మారాడనే ప్రచారం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేశారు. తాజాగా, అతడి కొడుకు డ్రగ్స్ వ్యవహారంలో తెరపైకి రావడంతో ఇప్పుడు పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సంచలనంగా మారింది. ఈ సూర్య అమ్మినేని‌తో అరెస్ట్ అయిన ఆరుగురిని ఈగిల్ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరికొంత మంది సెలబ్రిటీలతో పాటు ప్రముఖుల చిట్టా బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

రహస్యం బయటపడింది ఇలా..

ఈగిల్ అధికారులు వారం రోజుల కిందట వారికి అందిన సమాచారం మేరకు కొంపల్లి‌లోని మల్నాడు కిచెన్ రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని‌తో పాటు మరో ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈగిల్ అధికారులు సాంకేతికంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ సందర్భంలో ఈగిల్ పోలీసు అధికారులకు రాహుల్ తేజ గురించి తెలిసింది. అతని గురించి ఆరా తీసినప్పుడు 2024 జనవరిలో రాహూల్ తేజ‌పై నిజామాబాద్ పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో అతడని A3 నిందితుడిగా ఎఫ్ఐఆర్ చేశారు. కానీ, అతడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇదే విషయం‌పై ఈగిల్ అధికారులు ఆరా తీశారు. నిజామాబాద్ పోలీసులు డ్రగ్స్ కేసులో మిగతా నిందితులను విచారించినప్పుడు తమకు రాహుల్ తేజ డ్రగ్స్ అందిస్తుండే వాడని వాటిని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ నుంచి తీసుకువచ్చేవాడని వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ కేసులో నిజామాబాద్ పోలీసులు రాహూల్ తేజ‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆరా తీసినప్పుడు అతని ఎస్ఐబీ‌లో రిటైర్ అయ్యి, ప్రస్తుత్తం ఓఎస్డీగా పనిచేస్తున్న అధికారి కొడుకు అని తెలిసింది. దీంతో ఈగిల్ అధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఎస్ఐబీ మొత్తం వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అతడిపై చర్యలకు తీసుకునేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. అయితే, తాజాగా సూర్య అమ్మినేని కేసులో అరెస్టు చేస్తారా లేదా నిజామాబాద్ కేసులలో అరెస్టు చేస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

కనీసం బెయిల్ కూడా వేసుకోలేదు..

ఎస్ఐబీ పోలీస్ అధికారి కావడంతో పోలీసులు ఏడాది గడుస్తున్నా అతడిని ఒక్కసారి కూడా టచ్ చేయకపోవడం గమనార్హం. మిగతా నిందితుల మీద చార్జీషీటు వేసినా ఎస్ఐబీ పోలీసు అధికారి కొడుకు రాహుల్ తేజ‌పై ఏలాంటి చర్య తీసుకోకపోవడం‌పై ఇప్పుడు పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. రాహూల్ తేజ కూడా నిజామాబాద్ కేసులో A3‌గా ఉన్నప్పటికీ కనీసం ఆ కేసులో బెయిల్ లేదా ముందప్తు బెయిల్ కూడా తెచ్చుకోకపోవడం.. నిందితుడికి పోలీసులు ఎలా సహాకరించారో స్పష్టమవుతుందని ఈగిల్ అధికారులు అంటున్నారు.

Next Story