సోషల్ మీడియా లైవ్‌లో చూపిస్తూ.. ముగ్గురు యువతులపై డ్రగ్స్ గ్యాంగ్ దారుణం

by Naga Rani Yarlagadda |

ముగ్గురు యువతులపై డ్రగ్స్ గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టింది. ఆ ముగ్గురిపై చేసిన ఘోరాన్ని సోషల్ మీడియా లైవ్ లో చూపించడం దేశంలో సంచలనం సృష్టించింది.

సోషల్ మీడియా లైవ్‌లో చూపిస్తూ.. ముగ్గురు యువతులపై డ్రగ్స్ గ్యాంగ్ దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: ముగ్గురు యువతులపై డ్రగ్స్ గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టింది. ఆ ముగ్గురిపై చేసిన ఘోరాన్ని సోషల్ మీడియా లైవ్ లో చూపించడం దేశంలో సంచలనం సృష్టించింది. ఈ పాశవిక చర్యకు నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. బాధిత యువతుల కుటుంబ సభ్యులతో పార్లమెంట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించి.. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అర్జెంటీనా దేశ రాజధాని అయిన బ్యూనస్ ఎయిర్స్ లో ముగ్గురు యువతుల్ని చిత్రహింసలకు గురిచేసి.. అత్యంత దారుణంగా హతమార్చిందో డ్రగ్స్ గ్యాంగ్. మోరెనా వెర్డి (20), బ్రెండా డెల్ కాస్టిల్లో (20), లారా గుటియెర్రెజ్ (15) అనే ముగ్గురు యువతులు సెప్టెంబర్ 19న మిస్సయ్యారు. వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సైన యువతుల కోసం వెతుకుతున్న పోలీసులకు 5రోజుల తర్వాత.. ఒక ఇంటి పెరట్లో వారి మృతదేహాలు పాతిపెట్టి ఉన్నట్లు సమాచారం అందింది. డ్రగ్స్ గ్యాంగ్ తో వారికున్న గొడవలే హత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్థారించారు. యువతుల్ని పార్టీ పేరుతో మభ్యపెట్టి.. తమతో తీసుకెళ్లిన గ్యాంగ్.. దారుణంగా చంపేసింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన గ్యాంగ్ లో ఒకరు తన ఇన్ స్టా ప్రైవేట్ అకౌంట్లో లైవ్ టెలీకాస్ట్ చేసినట్లు చెప్పడంతో.. అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. గోళ్లను పీకి.. వేళ్లను నరికి, తీవ్రంగా కొట్టి.. ఊపిరాడకుండా చేసి చంపినట్లు లైవ్ చూసిన 45 మంది పోలీసులకు వివరించినట్లు సమాచారం.

కాగా.. ఈ లైవ్ టెలీకాస్ట్ జరిగిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఇన్ స్టాగ్రామా మాతృసంస్థ మెటా వెల్లడించింది. అధికారులకు దర్యాప్తులో ఎప్పుడూ సహకరిస్తామని మెటా ప్రతినిధి తెలిపారు. ముగ్గురు యువతుల హత్యకేసులో.. ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశామని, మరో 20 ఏళ్ల వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారని ఆ దేశ మంత్రి పాట్రిసియా బుల్రిచ్ వెల్లడించారు. తమకు న్యాయం చేయాలని బాధిత యువతుల కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story