మరో ఘోరం.. ఒకే కుటుంబంలో ముగ్గురిని నరికి చంపి డ్రైవర్ ఆత్మహత్య

by Malleboina Mahesh |

కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఉదయం ఒక కలకలం రేపిన సామూహిక హత్యల ఉదంతం వెలుగుచూసింది.

మరో ఘోరం.. ఒకే కుటుంబంలో ముగ్గురిని నరికి చంపి డ్రైవర్ ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: ఒకే కుటుంబంలో ముగ్గురిని డ్రైవర్ అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో శనివారం ఉదయం కలకలం గా మారింది. ఒక 34 ఏళ్ల వ్యక్తి తన తల్లి, అమ్మమ్మ, బావను కొడవలితో నరికి దారుణంగా హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కామాక్షిపాళ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్టిగెపాళ్యలో ఈ ఘోర ఘాతుకం చోటుచేసుకుంది.

మారణాయుధంతో విచక్షణారహితంగా దాడి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్ (34) అనే వ్యక్తి వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం (జూలై 11, 2026) ఉదయం వారి నివాసంలో కుటుంబ సభ్యులతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రశాంత్.. ఇంట్లోని కొడవలి (Machete) తీసుకుని తన తల్లి మంగళమ్మ, అమ్మమ్మ నంజమ్మ, బావ సతీష్‌లపై విచక్షణారహితంగా దాడి చేసి నరికి చంపాడు. ముగ్గురూ రక్తపు మడుగులో ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించుకున్న అనంతరం, ప్రశాంత్ కూడా అదే ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న కామాక్షిపాళ్య పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోర హత్యలకు గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story