ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి

by Taduka Kalyani |

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు.

ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే నిజమైన అభివృద్ధి
X

దిశ, సిద్దిపేట అర్బన్: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడమే నిజమైన అభివృద్ధి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సిద్దిపేటలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి అందిస్తున్న సేవలు వేలాది మందికి ఉపయోగపడుతున్నాయని హరీష్‌రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకుని కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ముఖ్యంగా డ్రైవర్లు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైతే ఉచితంగా కళ్లద్దాలు అందించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. సిద్దిపేటను ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశామని హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, బీఆర్ఎస్ నాయకులు, ఆటో ఎలక్ట్రికల్ అసోసియేషన్ ప్రతినిధులు, వైద్య బృందం, పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Next Story