FSSAI: ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు నోటీసులు

by S Gopi |

గడువు ముగిసిన ఉత్పత్తులు, పాడైన ఆహారం, కలుషిత గుడ్లు, పాలు, దెబ్బతిన్న ప్యాకేజింగ్‌లో ఆహార పదార్థాల సరఫరా వంటి ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

FSSAI: ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలపై స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా, ఆహార భద్రతా చట్టం-2006 కింద నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంటూ ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసింది. గడువు ముగిసిన ఉత్పత్తులు, పాడైన ఆహారం, కలుషిత గుడ్లు, పాలు, దెబ్బతిన్న ప్యాకేజింగ్‌లో ఆహార పదార్థాల సరఫరా వంటి ఆరోపణలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే నాణ్యత నియంత్రణ, ఆహార భద్రత పర్యవేక్షణ, ఇన్వెంటరీ నిర్వహణ, స్టాక్ రొటేషన్, పరిశుభ్రత, నిల్వ విధానాలు, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, దిద్దుబాటు చర్యలు వంటి అంశాలపై డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన నివేదికను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

అంతేకాకుండా, చెల్లని లేదా తప్పుగా పేర్కొన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్లు, లైసెన్స్‌లో లేని బ్రాండ్ల విక్రయం, విక్రేతల నమోదు, ట్రేసబిలిటీ, నిబంధనల అమలు వ్యవస్థల్లో లోపాలపైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రశ్నలు లేవనెత్తింది. ఫిర్యాదులను పరిష్కరించకుండా కేవలం రీఫండ్‌లు ఇవ్వడం సరిపోదని స్పష్టం చేసిన నియంత్రణ సంస్థ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకునే చర్యలపై కూడా స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి స్పష్టమైన ప్రణాళికను ఇవ్వాలని కోరింది.

Next Story