- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ భార్యతో కలిసి రూ.5.25 కోట్లు కొట్టెయడానికి డాక్టర్ స్కెచ్.. అసలు భార్య ఎంట్రీతో సీన్ రివర్స్
వైద్యుడు అంటే ప్రాణాలు పోయాల్సిన వాడు. కానీ ఓ కన్నింగ్ డాక్టర్ పేషెంట్ ప్రాణాలు తీసి రూ.5.25 కోట్లు కొట్టెయడానికి పక్కాగా స్కెచ్ చేశాడు.

దిశ, వెబ్‌డెస్క్ : వైద్యుడు అంటే ప్రాణాలు పోయాల్సిన వాడు. కానీ ఓ కన్నింగ్ డాక్టర్ పేషెంట్ ప్రాణాలు తీసి రూ.5.25 కోట్లు కొట్టెయడానికి పక్కాగా స్కెచ్ చేశాడు. ఇందుకు ఓ బ్యాంక్ ఉద్యోగితోపాటు ఓ మహిళను నకిలీ భార్యగా సృష్టించాడు. ఇన్సూరెన్స్‌నే పెట్టుబడిగా పెట్టిన ఈ ఆరుగురు సభ్యుల ముఠా.. ఓ నిండు ప్రాణాన్ని తీశాయి. కానీ మృతుడి అసలు భార్య ఎంట్రీతో వీరి దుశ్చర్య బయటపడింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి సంచలనం సృష్టించింది. విజయనగర ఎస్పీ ఎస్. జాహ్నవి మర్డర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం..
హోస్‌పేటకు చెందిన 34 ఏళ్ల గంగాధరకు ఆరేళ్ల క్రితం శారదమ్మతో వివాహం అయింది. ఆ తర్వాత మూడేళ్లకే గంగాధరకు పక్షవాతం వచ్చి శరీరంలోని ఎడమ భాగం సచ్చుబడిపోయింది. అప్పటి నుంచి అతడు ఇంటికే పరిమితం అయ్యాడు. వైద్యపరీక్షల కోసం అప్పడప్పుడు హోస్‌పేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లేవాడు. అయితే గంగావతి ఆస్పత్రి మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కృష్ణప్ప దృష్టి గంగాధరపై పడింది. అతని హెల్త్ కండీషన్‌ను పరిశీలించిన కృష్ణప్ప కన్నింగ్ ప్లాన్ చేశాడు. గంగాధర ఎక్కువ రోజులు బతకలేడని గ్రహించిన కృష్ణప్ప.. ఓ బ్యాంక్ ఉద్యోగి యోగరాజ్ సింగ్‌తో కుమ్మక్కై రూ.5 కోట్ల జీవిత బీమా చేయించాడు. మరో రూ.25 లక్షలు ప్రమాద బీమా చేయించాడు. ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకునేందుకు హులిగెమ్మ అనే మహిళను గంగాధరకు భార్యగా సృష్టించారు. ఈ ముగ్గురితోపాటు మరో ముగ్గురు గోసంగి రవి, అజయ్, రియాజ్ ముఠాగా ఏర్పడి ఇన్సూరెన్స్ చేయించారు. ఇదంతా ప్రాసెస్ చేయడానికి వీరికి రెండు నెలల సమయం పట్టింది.
అయితే గంగాధర ఎంతకూ చనిపోవకపోవడంతో కృష్ణప్ప ముఠా విసుగుచెందింది. దీంతో సెప్టెంబర్ 28న సాయంత్రం గంగాధరను కిడ్నాప్ చేశారు. అతడిని గంగావతిలో హత్య చేసి హోస్‌పేట శివారులోని సండూరు రోడ్డుపై ఎల్లెల్సీ వద్ద పడేశారు. అనంతరం దానిని ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహం పైనుంచి కారు ఎక్కించారు. పక్కన్న ఓ టీవీఎస్ ఎక్స్ఎల్ బండిని పడేసి వెళ్లిపోయారు. రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు హోస్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని గుర్తించిన స్థానికులు ఆయన భార్య శారదమ్మకు సమాచారం ఇచ్చారు.
ప్రమాదస్థలానికి వచ్చిన గంగాధర భార్య శారదమ్మ పోలీసులకు కీలక విషయాలు చెప్పింది. తన భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడని, తనకు బైక్ నడపడం రాదని, తమకు అసలు బండే లేదని సంచలన విషయం బయటపెట్టింది. దీంతో అనుమానస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మృతుడి ఫోన్ లోకేషన్, కాల్ డేటా ఆధారంగా 24 గంటల్లోనే డాక్టర్ కృష్ణప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అందించిన సమాచారంతో ముఠాలోని మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో ఈ హత్యకు మాస్టర్ మైండ్ హోస్‌పేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ కృష్ణప్పదేనని తేలింది. ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వీళ్లకు ఇదే మొదటి కేసా లేక గతంలోనే ఇలా ఎవరినైనా మర్డర్ చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేశారా అని పోలీసులు విచారిస్తున్నట్లు ఎస్పీ ఎస్. జాహ్నవి మీడియాకు వివరించింది.






