బాలిలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఎయిరిండియా పైలట్ మృతి

by Kema Shiva Kumar |

ఎయిరిండియాకు చెందిన సీనియర్ పైలట్ బాలిలో గుండెపోటుతో మరణించారు.

బాలిలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఎయిరిండియా పైలట్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: విధి నిర్వహణలో భాగంగా ఇండోనేషియా (Indonesia) వెళ్లిన ఎయిరిండియా (Air India)కు చెందిన ఓ సీనియర్ పైలట్ అక్కడ ఆకస్మికంగా మృతిచెందారు. బాలి (Bali)లోని ఓ హోటల్‌లో బస చేసిన సమయంలో ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. మరణించిన పైలట్‌ను ఎయిరిండియాలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ కమాండర్‌గా గుర్తించారు. ఆయన ఢిల్లీ నుంచి బాలికి విమానాన్ని నడిపారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత, తిరిగి ఢిల్లీకి రావడానికి ముందు లాయోవర్ (Layover) సమయంలో హోటల్ గదిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు హోటల్ సిబ్బంది ఆయనను అపస్మారక స్థితిలో గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. పైలట్ మరణాన్ని ఎయిరిండియా యాజమాన్యం ధృవీకరించింది. పైలట్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

పైలట్ల పని ఒత్తిడిపై మళ్లీ చర్చ..

ఇటీవలి కాలంలో విమానయాన రంగంలో పైలట్లు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. పైలట్ల పని గంటలు (Fatigue), మానసిక ఒత్తిడి కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమానయాన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది కాలంలోనే ఇలాంటి ఘటనలు పెరగడంపై పైలట్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Next Story