సూరం చెరువులో డ్రమ్ములో వ్యక్తి మృతదేహం..

by Disha Web Desk 11 |
సూరం చెరువులో డ్రమ్ములో వ్యక్తి మృతదేహం..
X

దిశ, బడంగ్​పేట్: సంచలనం సృష్టించిన సూరం చెరువులో ఓ డ్రమ్ములో లభ్యమైన 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసులో పహాడిషరీఫ్​ పోలీసులు పురోగతిని సాధించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కాస్త పటేల్​నగర్​కు చెందిన పురన్​సింగ్​గా పహాడిషరీఫ్​ పోలీసులు గుర్తించారు. మృతుని తలపై బలమైన గాయాలు ఉండడంతో పురన్​సింగ్​ది హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పహాడిషరీఫ్​ ఇన్​స్పెక్టర్​ విశ్వనాథ్​ తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడలోని సూరం చెరువులో 30 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం డ్రమ్ములో కాళ్లు పైకి తేలుతూ ఉండడంతో గురువారం సాయంత్రం 4గంటలకు గమనించిన స్థానికులు పహాడిషరీఫ్​ పోలీసులకు సమాచారం అందజేశారు.

హుటాహూటిన ఘటనా స్థలికి చేరుకున్న పహాడిషరీఫ్ పోలీసులు సూరం చెరువులోని డ్రమ్ములో ఉన్న మృతదేహాన్ని వెలికి దీశారు. అప్పటికే ఆ మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడంతో మూడు రోజుల క్రితమే ఆతను మృతి చెంది ఉండవచ్చని అది గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంతరం గత నాలుగు రోజులుగా సమీప పోలీస్టేషన్​ పరిధిలలో ఎవరైనా 30 నుంచి 40 సంవత్సరాల వ్యక్తులు మిస్సింగ్​లు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అందులో చాంద్రాయణగుట్ట పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ నెల 23వ తేదీన ఓ వ్యక్తి మిస్సింగ్​ కేసు నమోదు కావడంతో ఆ ఫైల్​ ఫొటోను ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్​ అయిన వ్యక్తి భార్యను విచారించగా అతని ఒంటిపై ఉన్న బట్టల సహాయంతో అతను తన భర్తనే అని గుర్తించింది. బండ్లగూడ పటేల్​ నగర్​కు చెందిన పురన్​ సింగ్​ (30), భార్య మమతాదేవిలు దంపతులు. పురన్​ సింగ్​ గప్​చుప్​ బండి నడిపించుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని, ఈ నెల 22వ తేదీన తన భర్త కనిపించకుండా పోయాడని ఈ నెల 23వ తేదీన సాయంత్రం భార్య మమతా దేవి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎక్కడో హత్యచేసి, సూరం చెరువులో పడవేసినట్లు అనుమానం..

పురన్​సింగ్​ మృతదేహాం పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉండడంతో నాలుగు రోజుల క్రితం చనిపోయినట్లు పోలీసులు ఇప్పటికే అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అతన్ని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములో పడేసి తుక్కుగూడలోని సూరం చెరువులో పడవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాకుండా పురన్​సింగ్​ ఫోన్​ నెంబర్​ ఆధారంగా చివరగా అతనికి చివరగా వచ్చిన పోన్​కాల్స్​ లిస్ట్​ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అతి త్వరలో పురన్​సింగ్​ హత్యకేసు మిస్టరీని ఛేదిస్తామని పహాడిషరీఫ్​ ఇన్​ స్పెక్టర్​ విశ్వనాథ్​ తెలిపారు. ఈ కేసును పహాడిషరీఫ్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed