బెంగళూరు దారుణం.. సైడ్ మిర్రర్‌ను తాకాడని బైకర్‌ను వెంటాడి చంపిన దంపతులు

by Malleboina Mahesh |

రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ తమ కారు మిర్రర్‌ను తాకిందనే కోపంతో కారుతో వెంటాడి మరి బైకర్ ను దారుణంగా దంపతులు హత్య చేశారు.

బెంగళూరు దారుణం.. సైడ్ మిర్రర్‌ను తాకాడని బైకర్‌ను వెంటాడి చంపిన దంపతులు
X

దిశ, వెడ్‌డెస్క్: రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్ తమ కారు మిర్రర్‌ను తాకిందనే కోపంతో కారుతో వెంటాడి మరి బైకర్ ను దారుణంగా దంపతులు హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న అర్ధరాత్రి సమయంలో ఫుట్టనహెళి శ్రీరామ లేఅవుట్ ప్రాంతంలో బైక్‌పై ప్రయాణిస్తున్న దర్శన్, వరుణ్ అనే ఇద్దరు యువకులు అనుకోకుండా పక్కగా వెళ్తున్న కారు సైడ్ మిర్రర్‌ను తాకారు. ఈ చిన్న సంఘటన పెద్ద గొడవకు దారితీసింది. దీంతో కారులో ఉన్న దంపతులు దర్శన్‌తో వాగ్వాదానికి దిగారు. వివాదం అక్కడితో ముగియకపోవడంతో దంపతులు కోపంతో బైకర్ ను కారుతో వెంబడించారు.

సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వెంటాడి, చివరికి బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టి పరారయ్యారు. అతి వేగంతో బైక్ ను ఢీకొట్టడంతో దర్శన్‌ బైక్ చాలా దూరం ఎగిరి పడింది. గాయాల తీవ్రతతో దర్శన్‌ అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్ర గాయాలపాలైన దర్శన్‌, వరుణ్‌లను తక్షణమే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు దర్శన్‌ను మృతిచెందినట్లు ప్రకటించారు. వరుణ్‌ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందిత దంపతుల కోసం గాలిస్తున్నారు. చిన్న రోడ్డు వివాదం ఇలా దారుణానికి దారితీసిన ఈ సంఘటనపై నగరవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Next Story