TG: లెర్నింగ్ లైసెన్స్ జారీలో భారీ దోపిడీ.. నెల రోజులుగా ఏసీబీ నిఘా

by Gantepaka Srikanth |   (  Updated:2025-07-04 02:11:41  IST  )

రాష్ట్రంలో ఆర్టీఏ అధికారుల అవినీతికి అంతు లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందు స్కూల్ బస్సులకు సంబంధించిన ఫిట్‌నెస్​తనిఖీల్లో పెద్ద మొత్తంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

TG: లెర్నింగ్ లైసెన్స్ జారీలో భారీ దోపిడీ.. నెల రోజులుగా ఏసీబీ నిఘా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఆర్టీఏ అధికారుల అవినీతికి అంతు లేకుండా పోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల ప్రారంభానికి ముందు స్కూల్ బస్సులకు సంబంధించిన ఫిట్‌నెస్​తనిఖీల్లో పెద్ద మొత్తంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ప్రైవేటు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.2 లక్షల వరకు లంచం తీసుకొని కేవలం ఒకటి రెండు బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించి మిగతా అన్ని బస్సులకు సర్టిఫికెట్లు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త డ్రైవర్లకు సైతం బస్సులు నడిపేలా అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రవాణాశాఖ అక్రమాలపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు నెల రోజులుగా నిఘా పెట్టారు. ఏక కాలంలో హైదరాబాద్‌లోని మూడు కార్యాలయాలు సహా రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రాంతీయ రవాణా అథారిటీ కార్యాలయాలపై ఆకస్మిక సోదాలు నిర్వహించారు. 18 మంది ఆర్టీఏ ఏజెంట్లు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

లెర్నింగ్​లైసెన్స్‌ల జారీలో ఏజెంట్ల దోపిడీ

కొత్తగా లైసెన్స్​తీసుకునేందుకు వచ్చిన వారి నుంచి ఏజెంట్లు రూ.6 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. డ్రైవింగ్​సక్రమంగా రాకుంటే తమ దగ్గరలో డ్రైవింగ్​స్కూల్ ఉందని మరో రూ.3 వేలు చెల్లిస్తే పదిరోజుల్లో లైసెన్స్​వస్తుందని దోపిడీకి పాల్పడుతున్నారు. తిరుమలగిరిలో ఇద్దరు, ఉప్పల్‌లో​10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారిస్తే.. ఒక్కో ఏజెంట్ ద్వారా 200లకుపైగా లైసెన్స్​కోసం దరఖాస్తులు వచ్చినట్లు, వారి నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది.

15 ఏళ్లు దాటిన బస్సులను పాఠశాల విద్యార్థుల రవాణాకు వినియోగించకూడదు. ప్రతి విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్‌ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. డ్రైవర్‌ షుగర్, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్‌కు 5 సంవత్సరాల అనుభవం తప్పనిసరి. బస్సుకు సంబంధించిన వైపర్స్, విండ్‌ స్క్రీన్, పార్కింగ్‌ లైట్స్‌, లైటింగ్స్ ఉండాలి. బస్సు టైర్లు కండిషన్‌గా ఉండాలి. ప్రతి బస్సు లో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించే విధంగా అద్దాలు అమర్చుకోవాలి. బస్సులో అటెండర్‌ తప్పకుండా ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ పట్టిక ఉండాలి. ప్రైవేటు విద్యాసంస్థలు అధికారులకు లంచాలు ఇచ్చి మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఆటోమేటెడ్​ టెస్టింగ్​ స్టేషన్లు

ఆర్టీఏలో అవినీతిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో రహదారి భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది. వీటిని చాలా రాష్ట్రాలు అమలు చేస్తూ లైసెన్స్‌లు రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేస్తున్నారు. స్థానిక కార్యాలయాలకు జారీ చేసే అధికారాలను తొలగించారు. అక్కడ అవినీతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అదే విధంగా తెలంగాణలోనూ బడి బస్సులు, ఇతర వాహనాల ఫిట్‌నెస్​పరీక్షల్లో మానవ ప్రమేయం లేకుండా ఆటోమేటెడ్​టెస్టింగ్​స్టేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

Next Story