- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విదేశీయులను జల్లెడ పడుతోన్న సిటీ పోలీస్.. వీసా గడువు ముగిసినా ఇక్కడే మకాం
వీసా గడువు ముగిసిన రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుతం చర్యలు చేపట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: వీసా గడువు ముగిసిన రాష్ట్రంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుతం చర్యలు చేపట్టింది. ఇందుకు జీవో కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. విదేశీయులను గుర్తించేందుకు పోలీస్ శాఖలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్రమంగా ఉంటున్న వారితో హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పోలీసు శాఖ గుర్తించింది. ఎట్టి పరిస్థితుల్లో వీసా గడువు ముగిసిన వారు రాష్ట్రంలో ఉండకూడదని హెచ్చరికలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పట్టుబడిన వారి వివరాలను ఫారిన్ రిజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఓ)లకు సమాచారం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆయా దేశాలకు ఎంబసీలకు సమాచారం ఇచ్చి డిపోర్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీసా గుడువు ముగిసి పట్టుబడిన వారిని జోగిపేట జైలుకు తరలించేందుకు సన్నాహలు చేస్తున్నారు.
డ్రగ్స్ సరఫరాలో నైజీరియన్ల కదలికలపై నిఘా..
ఇటీవల కాలంలో రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు పెరిగినట్లు నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) అధికారులు గుర్తించారు. డ్రగ్స్ దందా అరికట్టేందుకు ప్రత్యేకంగా ఈగల్ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ సరఫరా అవుతుందని టీజీ న్యాబ్, ఈగల్ బృందాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా విదేశాలలో లభించే ఓజీ కుష్ గంజాయి కూడా అక్రమంగా ఉంటున్న విదేశీయుల వల్లే అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. వీరిపై నిఘా ఉంచాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీసీఎస్ డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
టోలిచౌకీలో 18 మంది విదేశీయుల గుర్తింపు
వీసా గడువు ముగిశాక కూడా అక్రమంగా రాష్ట్రంలో నివసిస్తున్న 18 మంది విదేశీయులను హైదరాబాద్ సౌత్ వెస్ట్ పోలీసులు జూన్ 20న టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారా మౌంట్ కాలనీలో కార్డెన్ సెర్చ్‌లో గుర్తించారు. మెడికల్ ఎమర్జెన్సీ, స్టూడెంట్ వీసాల మీద 2023లో ఇండియాకు వచ్చిన వీరు గడువు ముగిసినా తిరిగి తమ దేశాలకు వెళ్లకుండా ఇక్కడే స్థిరపడి జీవనం సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వీరందరూ కెన్యా, నైజీరియా, ఈటోపియా, సోమాలియా దేశాలకు చెందిన వారని పేర్కొన్నారు.
వారి కోసం పోలీసుల జల్లెడ
బాలాపూర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి, పహాడీషరీఫ్, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో బంగ్లాదేశ్‌కు చెందిన వారిని గత సంవత్సరం పోలీసులు గుర్తించారు. చిరువ్యాపారాలు, పరిశ్రమలు, భవన నిర్మాణరంగ కార్మికులుగా ఉపాధి అవకాశాలు చూసుకుని ఉంటున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ ప్రాంతాలలో కూడా పోలీసులు జల్లెడ పట్టనున్నారు. డ్రగ్స్ దందాతో పాటు, సైబర్ నేరాల్లో కూడా వీరు నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు.






