- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్యాపేట జిల్లాలో కలకలం: మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్
చట్టాన్ని కాపాడాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారాడు.

దిశ, వెబ్‌డెస్క్/హుజూర్ నగర్: చట్టాన్ని కాపాడాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారాడు. సమాజంలో బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి, అదీ పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ నిస్సిగ్గుగా మైనర్ బాలికను వివాహం చేసుకున్న ఉదంతం సూర్యాపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఈ అక్రమ వివాహంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సదరు కానిస్టేబుల్‌పై చట్టపరమైన కేసు నమోదైంది.
అసలేం జరిగిందంటే..?
పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా పరిధిలోని సీతారాంపురం గ్రామానికి చెందిన నాయని అనిల్ కుమార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతను యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. అయితే, చట్టాలపై కనీస అవగాహన ఉన్నప్పటికీ, అనిల్ కుమార్ ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన ఒక మైనర్ బాలికను గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకున్నాడు. మైనర్ బాలికకు, కానిస్టేబుల్‌కు వివాహం జరిగిందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న ఐసీడీఎస్ (ICDS), మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు తక్షణమే రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, బాలిక మైనర్ అని నిర్ధారించుకున్న అనంతరం, హుజూర్‌నగర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసు..
అధికారుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన హుజూర్‌నగర్ పోలీసులు.. ట్రాఫిక్ కానిస్టేబుల్ నాయని అనిల్ కుమార్‌తో పాటు ఈ పెళ్లికి సహకరించిన పెద్దలపై బాల్య వివాహాల నిరోధక చట్టం (Prohibition of Child Marriage Act) కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలకు కూడా ఉన్నతాధికారులు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన స్థానంలో ఉండి, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కానిస్టేబుల్ తీరుపై స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.






