ఘోర రోడ్డుప్రమాదం.. ఐదు వాహనాలను ఢీ కొట్టి నుజ్జునుజ్జయిన కారు, నలుగురు దుర్మరణం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-22 03:27:20  IST  )

డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

ఘోర రోడ్డుప్రమాదం.. ఐదు వాహనాలను ఢీ కొట్టి నుజ్జునుజ్జయిన కారు, నలుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి ఇతర వాహనాలను ఢీ కొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర విషాద ఘటన మహారాష్ట్రలోని అంబర్ నాథ్ ప్రాంతంలో జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కారు డ్రైవర్ ఉన్నట్టుండి గుండెపోటుకు గురయ్యాడు. దాంతో కారు అదుపుతప్పి డివైడర్ ను దూకి.. ఎదురుగా వస్తోన్న 5 వాహనాలను ఢీ కొట్టింది. శుక్రవారం (నవంబర్ 21) సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా నలుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న డ్రైవర్ కాలు యాక్సిలరేటర్ పై ఇరుక్కోవడంతో గుండెపోటుకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. కారు నుజ్జు నుజ్జవ్వడంతో దానికి రోడ్డు పక్కకు జరిపి ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా క్లియర్ చేశారు. డిసెంబర్ 2వ తేదీన అంబర్ నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలకు శివసేన అభ్యర్థి కిరణ్ చౌబే తన డ్రైవర్ లక్ష్మణ్ షిండేతో కలిసి మట్కా చౌక్ సమీపంలోని బువా పాడా ప్రాంతంవైపు ప్రచారం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

మృతులను కారు డ్రైవర్ షిండే, చంద్రకాంత్ అనార్కే (57), శైలేష్ జాదవ్ (45), అంబర్ నాథ్ మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగి సుమిత్ చెలాని (17)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బైక్ పై వెళ్తున్న జాదవ్ తో పాటు అనార్కే అనే వ్యక్తి కూడా వంతెనపై నుంచి పడిపోయినట్లు తెలిపారు.

Next Story