- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగా ఉన్నాడని అతి కిరాతకంగా హత్య.. వారెవ్వా కథ, స్క్రీన్ ప్లే అంతా పెళ్లామే!
అందం పిచ్చితో అక్రమ సంబంధం పెట్టుకుని.. తనకు అడ్డుగా ఉన్నాడని భర్తను సుపారీ ఇచ్చి చంపించిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు.. అది రెండు మనసుల అనుబంధం, జీవితాంతం తోడుంటామనే ఒక పవిత్రమైన ప్రమాణం. రంగు, రూపం, ధనిక, పేద అనే భేదాలకు అతీతంగా ఒకరినొకరు ఆత్మీయంగా స్వీకరించడమే దాంపత్యానికి అసలైన అర్థం. కానీ, ఈ రోజుల్లో బాహ్య సౌందర్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత ఆత్మీయ అనుబంధాలకు లేకుండా పోతోంది. క్షణికావేశాలు, అక్రమ సంబంధాలు, స్వార్థంతో ఏకంగా కట్టుకున్నోడి ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్నారు కొందరు మహిళామణులు.
తాజాగా, మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ధార్ (Dhar) జిల్లాలో ఒక భార్య తన ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా చంపించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. దేవకృష్ణ (28) సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తుంటాడు. ఏప్రిల్ 7న రాత్రి తన ఇంట్లోనే నిద్రిస్తుండగా దుండగులు అతడిపై దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తొలుత ఈ ఘటనను ఓ దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది అతడి భార్య ప్రియాంక పురోహిత్ (25). దొంగలు ఇంట్లోకి చొరబడి తనను బంధించి, రూ.3.5 లక్షల విలువైన నగలు దోచుకెళ్లారని, అడ్డుకున్న తన భర్తను చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అసలు విషయం బయటపడింది ఇలా..
పోలీసుల దర్యాప్తులో ప్రియాంక మాటల్లో తేడాలు కనిపించాయి. ఆమె కాల్ డేటాను పరిశీలించగా, కమలేష్ పురోహిత్ (Kamalesh Purohit) అనే వ్యక్తితో ఆమెకు ఉన్న అక్రమ సంబంధం బయటపడింది. పోలీసులు గట్టిగా విచారించడంతో ఆమె అసలు విషయాన్ని అంగీకరించింది. భర్త దేవకృష్ణ నల్లగా ఉండటమే ఆమెకు నచ్చలేదు. ‘నువ్వు చాలా నల్లగా ఉన్నావు.. నాకు అసలు తగవు. నా స్థాయికి తగ్గ మనిషివి కాదు’ అంటూ నిత్యం ఇంట్లో అతడిని అవమానించేది.
మాస్టర్ ప్లాన్ భార్యదే..
ప్రియుడు కమలేష్‌తో కలిసి జీవించడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ప్రియాంక, అతడిని భర్తను ఎవరికీ అనుమానం రాకుండా హతమార్చాలని ప్లాన్ చేసింది. అనుకుందే తడవుగా కమలేష్ ద్వారా సురేంద్ర భాటి (Surendra Bhati) అనే వ్యక్తికి రూ.1 లక్ష సుపారీ ఇచ్చింది. అందులో రూ. 50 వేలు అడ్వాన్స్‌గా ముందే చెల్లించింది. హత్య జరిగిన రాత్రి కావాలనే ప్రియాంక ఇంటి తలుపులు తీసి పెట్టింది. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా సురేంద్ర లోపలికి వచ్చి దేవకృష్ణను పదునైన కత్తితో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. దోపిడీ జరిగినట్లు నమ్మించడానికి ప్రియాంక ఇంట్లోని సామాన్లను చిందరవందర చేసింది. నగలను దాచిపెట్టి, తనను తాను బంధించుకుని కేకలు వేసింది.
పోలీసుల విచారణ..
మృతుడు దేవకృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను సేకరించారు. విచారణలో భాగంగా ప్రియాంక పురోహిత్ పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అనంతరం ఆమె కాల్ డేటా (Call Data)ను చెక్ చేయగా, ఈ హత్య వెనుక మాస్టర్ మైండ్ ప్రియాంక అని తేలింది. ఈ మేరకు ప్రియుడు కమలేష్‌తో పాటు ఆమెను అరెస్ట్ చేశారు. సుపారీ తీసుకున్న హంతకుడు సురేంద్ర కోసం ప్రస్తుతం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మరోవైపు మృతుడి తల్లి తన కుమారుడిని పొట్టనబెట్టుకున్న నిందితులకు ఉరిశిక్ష వేయాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.






