ప్రేమోన్మాది ఘాతుకం..పెళ్లికి నిరాకరించినందుకు యువతి దారుణ హత్య!

by Malleboina Mahesh |

బెంగళూరు మహాలక్ష్మి లేఔట్‌లో ఘోరం.. నేరచరిత్ర ఉందని దూరం పెట్టినందుకు, డిన్నర్‌కు పిలిచి ప్రియురాలు అంజలి గొంతుకోసి చంపిన ఉన్మాది రాజీవ్ అరెస్ట్!

ప్రేమోన్మాది ఘాతుకం..పెళ్లికి నిరాకరించినందుకు యువతి దారుణ హత్య!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిన కారణంతో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కోపంతో ఉగిపోయి.. ఆమె గొంతు కోసి ప్రాణాలు తీశాడు. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని మహాలక్ష్మి లేఔట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అంజలి (23), రాజీవ్ అనే ఇద్దరు కొన్నాళ్ల క్రితం ఒకేచోట పని చేసేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి గత నాలుగేళ్లుగా వీరి ప్రేమాయణం సజావుగానే సాగింది. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి రాజీవ్‌కు గతంలో నేర చరిత్ర ఉందన్న నిజం అంజలి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో అంజలి తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించారు. తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించిన అంజలి.. రాజీవ్‌ను క్రమంగా దూరం పెట్టడం ప్రారంభించింది. తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన రాజీవ్, ఆమెపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు.

డిన్నర్‌కు పిలిచి కత్తితో దాడి

ఎలాగైనా ఆమెను అంతమొందించాలని పథకం పన్నిన రాజీవ్, మాట్లాడదామంటూ మహాలక్ష్మి లేఔట్‌లో డిన్నర్‌కు రావాలని అంజలిని ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన అంజలితో మళ్లీ పెళ్లి ప్రస్తావన తేవడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన రాజీవ్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో అంజలి గొంతు కోశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అంజలి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి, కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడు రాజీవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story