- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. బాత్ రూమ్‌లో ప్రత్యక్షమైన అప్పుడే పుట్టిన చిన్నారి
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది.

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ప్రాణాలు పోయాల్సిన లేబర్ వార్డులోనే ఒక అప్పుడే పుట్టిన పసిగుడ్డు విగతజీవిగా మారిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. లేబర్ వార్డులో ప్రసవం జరిగిన అనంతరం, అప్పుడే పుట్టిన చిన్నారిని అక్కడి బాత్రూమ్ లో పడేసినట్లు తెలుస్తోంది. అత్యంత సున్నితంగా చూసుకోవాల్సిన నవజాత శిశువును కనీస మానవత్వం లేకుండా బాత్రూమ్‌లో పడేయడం వెనుక అసలు ఏం జరిగిందనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యులు, అక్కడి డ్యూటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా పసికందు మాయం..
బాత్రూమ్‌లో పడేసిన కాసేపటికే ఆ చిన్నారి మృతి చెందినట్లు సమాచారం. అయితే, ఈ విషయం బయటకు పొక్కితే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భావించిన కొందరు వైద్య సిబ్బంది, ఆ చిన్నారి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా.. గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి మాయం చేశారనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రి రికార్డులను సైతం ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆసుపత్రి వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతటి దారుణమైన సంఘటనపై ఆసుపత్రి ఉన్నతాధికారులు కనీసం నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కింది స్థాయి సిబ్బంది లేదా డాక్టర్ల తప్పులను కప్పిపుచ్చి, వారిని ఈ కేసు నుంచి సురక్షితంగా బయటపడేయడానికే ఉన్నతాధికారులు తీవ్రంగా తాపత్రయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, కనీసం విచారణకు కూడా ఆదేశించకపోవడంపై బాధితులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి ఈ దారుణంపై సమగ్ర విచారణ జరిపించాలని, పసికందు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.






