- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ వీడియోల బ్లాక్‌మెయిల్.. సొంత వదిన హత్యకు మరదలు మాస్టర్ ప్లాన్
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం నగరంలో మే 28వ తేదీ అర్ధరాత్రి జరిగిన పుష్పలత దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలోని చిక్కబళ్లాపురం నగరంలో మే 28వ తేదీ అర్ధరాత్రి జరిగిన పుష్పలత (23) దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ దొంగలు ఇంట్లోకి చొరబడి తనపై దాడి చేసి, వదినను చంపేశారని నమ్మించేందుకు ప్రయత్నించిన మృతురాలి మరదలు భవ్య ఆడిన నాటకాన్ని పోలీసులు 24 గంటల్లోనే బట్టబయలు చేశారు. పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లైన భవ్యకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అతడు ఆమె ప్రైవేట్ వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీని నుంచి బయటపడేందుకు భవ్య తన కజిన్ ‘లోహిత్’ను ఆశ్రయించింది. అయితే ఆ వీడియోలను చేజిక్కించుకున్న లోహిత్, తానే భవ్యను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికే రూ. 6 లక్షలు లాగిన లోహిత్.. మరింత డబ్బు డిమాండ్ చేయడంతో, వదిన పుష్పలత బంగారు నగలు దోచుకోవాలని భవ్య అతడితో కలిసి పథకం పన్నింది.
పక్కా ప్లాన్.. దొంగల దాడిగా చిత్రీకరణ
ఈ ప్లాన్ గురించి భవ్య తల్లి విజయలక్ష్మికి ముందే తెలుసని పోలీసులు అనుమానించారు. పథకంలో భాగంగా మామ నరసింహమూర్తి, భర్త భరత్‌లను తమిళనాడుకు గుడికి పంపించారు. కుటుంబ కలహాలతో వేరుగా ఉంటున్న వదిన పుష్పలతను రాత్రి తోడు కోసం ఇంటికి పిలిపించుకున్నారు. ఆ రాత్రి ఇంట్లోకి వచ్చిన లోహిత్.. నిద్రిస్తున్న పుష్పలతను దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. దొంగలు చేసిన హత్యగా నమ్మించడానికి మృతదేహం గొంతు కోసి, మంగళసూత్రం, కమ్మలు ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత భవ్య తన బట్టలు తానే చించుకుని, దొంగలు తనపై మత్తుమందు చల్లి దాడి చేసి స్పృహ కోల్పోయేలా చేశారని నాటకమాడింది.
అత్త విజయలక్ష్మి అదుపులోకి..
ఇంట్లోకి దొంగలు బలవంతంగా చొరబడిన (Forced entry) ఆనవాళ్లు లేకపోవడం పోలీసులకు తొలి అనుమానం తెప్పించింది. భవ్య గొంతుపై ఉన్న గాయం చాలా చిన్నదిగా ఉండటం, పోస్ట్‌మార్టమ్ నివేదికలో పుష్పలత ఊపిరి ఆడక చనిపోయిందని తేలడంతో పోలీసుల అనుమానం బలపడింది. ఆస్పత్రిలో ఉన్న భవ్యను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించింది. ప్రస్తుతం పోలీసులు భవ్య, లోహిత్‌లను అరెస్టు చేశారు. ఈ కుట్రలో భాగమున్నట్లు భావిస్తున్న అత్త విజయలక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతురాలి భర్త, మామలకు ఈ ఘటనతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.






