బెంగుళూరులో దారుణం.. క్షుద్రపూజల కోసం పెంపుడు కుక్కను బలిచ్చిన మహిళ

by Ajay Maddhiboyina |

బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ మ‌హిళ క్షుద్ర‌పూజ‌ల కోసం త‌న పెంపుడు కుక్క‌నే బ‌లిచ్చింది. త‌ర‌వాత దానిని అపార్ట్‌మెంట్‌లోనే పెట్టగా దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది.

బెంగుళూరులో దారుణం.. క్షుద్రపూజల కోసం పెంపుడు కుక్కను బలిచ్చిన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ఓ మ‌హిళ క్షుద్ర‌పూజ‌ల కోసం త‌న పెంపుడు కుక్క‌నే బ‌లిచ్చింది. త‌ర‌వాత దానిని అపార్ట్‌మెంట్‌లోనే పెట్టగా దుర్వాసన రావడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన త్రిపర్ణ పైక్ అనే మహిళ బెంగుళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. కాగా ఆ అపార్ట్‌మెంట్ నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి పరిశీలించగా అపార్ట్మెంట్‌లోకి వ‌చ్చేందుకు త్రిప‌ర్ణ అధికారుల‌ను అనుమ‌తించ‌లేదు. దీంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని మ‌హిళ‌ను హెచ్చ‌రించారు.

ఇంట్లోకి వెళ్లి చూడ‌గా ఒక గుడ్డ‌లో చుట్టి కుళ్లిపోయిన స్థితిలో కుక్క మృతదేహాన్ని గుర్తించారు. అక్క‌డ క్షుద్ర‌పూజ‌లు చేసిన ఆన‌వాళ్లు సైతం ఉండ‌టంతో కంగు తిన్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని కుక్కకు పోస్ట్ మార్టం నిర్వ‌హించ‌గా కుక్క గొంతు నులిమి హ‌త్య చేసి త‌ర‌వాత గొంతు కోసిన‌ట్టు తేలింది. ఆమె ఇంట్లో మ‌రో రెండు పెంపుడు కుక్క‌ల‌ను చూసి వాటిని సైతం నిర్ల‌క్ష్యంగా క‌ట్టేసి ఉంచ‌డంతో మ‌హిళ‌పై జంతు హింస కేసు న‌మోదు చేశారు. మ‌హిళ వ‌ద్ద మొత్తం నాలుగు లాబ్ర‌డార్ కుక్కలు ఉండేవ‌ని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతుండగా మరో కుక్కను సైతం మహిళ బలి ఇచ్చిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటన బెంగుళూరులో సంచలనం రేపగా మహిళ తీరుపై జంతు ప్రేమికులు భగ్గుమంటున్నారు.

Next Story