లగేజ్ కోసం వెళ్లి ఎన్ఐఏకి చిక్కిన భయ్యా సన్నీ యాదవ్..!

by Chintha Aamani |   (  Updated:2025-05-30 08:29:39  IST  )

యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌‌ని చెన్నైలో ఎన్ఐఏ అధికారులు

లగేజ్ కోసం వెళ్లి ఎన్ఐఏకి చిక్కిన భయ్యా సన్నీ యాదవ్..!
X

దిశ,సూర్యాపేట : యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ని చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన భయ్యా సన్నీ యాదవ్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి పూర్తి చేశాడు. ఖమ్మంలో ఇంటర్ వరకు చదివి అనంతరం బైక్ రైడింగ్ నేర్చుకున్నాడు. సన్నీ యాదవ్ తల్లిదండ్రులు భయ్యా రవి, శ్రీదేవి నూతనకల్ మండల కేంద్రంలో మెడికల్ షాప్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. నిత్యం యూట్యూబ్‌లో గడిపే సందీప్ (సన్నీ) కి ఓ ఆలోచన వచ్చి యూట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేసేవాడు. యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్స్ పెరగడంతో ద్విచక్ర వాహనంతో విదేశాలు తిరుగుతూ ఆ వీడియోలను అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించడం ప్రారంభించాడు.

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌తో వివాదస్పదం

అయితే యూట్యూబ్‌పై వచ్చే ఇన్కంతో విదేశాలు తిరగడం కష్డాటంగా మారడంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. తన వీడియోలతో బెట్టింగ్‌ యాప్‌‌లను ప్రమోట్ చేస్తుండటంతో గమనించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ లకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టారు. ఈ బెట్టింగ్ యాప్‌ల వల్ల ఎంతోమంది యువత అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఆ పోస్ట్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్‌ మీడియా అకౌంట్ కు ట్యాగ్‌ చేశారు. ఆ ఫిర్యాదుని సుమోటోగా తీసుకున్న పోలీసులు భయ్యా సన్నీ యాదవ్ పై 111(2)318(4)46r/w, 61(2)BNs 3,4,TSGA 66C66, DITA2000-2008 తదితర సెక్షన్ల కింద ఛీటింగ్ కేసులు నమోదు చేశారు.

యూట్యూబర్‌ సన్నీయాదవ్‌పై లుక్ ఔట్ నోటీసులు

బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో భయ్యా సన్నీ యాదవ్ పై నూతనకల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీంతో ఆయన ఇండియాకు రాకుండా విదేశాల్లోనే ఉండిపోయాడు. దీంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల నుంచి ఏ మార్గంలో భారత్ వచ్చినా ఇమిగ్రేషన్ అధికారుల ద్వారా సన్నీని అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించడంతో కోర్టును ఆశ్రయించి అరెస్ట్ చేయకుండా ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు ఆదేశం మేరకు భయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేయని పోలీసులు.. తమకు తెలియకుండా దేశం విడిచి వెళ్లవద్దని సూచించారు.

పాకిస్తాన్‌లో బైక్ రైడ్ పూర్తి చేసినట్లు వీడియో విడుదల

సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్ లో బైక్ రైడ్ పూర్తి చేసినట్లు వీడియోలు విడుదల చేశాడు. పాకిస్తాన్‌లో స్థానికుడితో వెళ్తూ జైశ్రీరామ్ అంటూ ఓ వీడియో, పాకిస్తాన్‌లో సిమ్ము కోసం ఎన్నో కష్టాలు అనే మరోవీడియో, హైదరాబాద్ టు పాకిస్తాన్ బైక్ పై సాహస యాత్ర అనే ఇంకో వీడియో, పాకిస్తాన్ ఆర్మీ వ్యక్తి షాక్ అంటూ పలు వీడియోలు సన్నీ యాదవ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. అక్కడే రెండు నెలల వరకు తిరిగి టూర్ వీడియోలను పోస్ట్ చేశాడు. అయితే, ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ పాకిస్తాన్ వీడియోలతో పాటు ఇండియన్ ఆర్మీకి చెందిన ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయడకూడదని కేంద్ర ప్రభుత్వం అడ్వైజర్ జారీ చేసింది.

కానీ సన్నీ యాదవ్ నిబంధనలకు విరుద్ధంగా ఇటీవలే పాకిస్తాన్ బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేశాడు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చెన్నై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు అతడిని చెన్నై ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకుని ఢిల్లీలోని ఎన్ఐఏ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. సన్నీ యాదవ్ లగేజీ చెన్నై ఎయిర్ పోర్ట్‌కు రావడంతో దానిని తీసుకోవడానికి వెళ్లి ఎన్ఐఏ అధికారులకు చిక్కాడు. అయితే సన్నీ యాదవ్ గతంలోనే పాకిస్తాన్ టూర్ ముగించుకొని ఇండియాలోనే ఉండి వీడియోలు అప్లోడ్ చేశాడా, ఇండియా పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న వేళ పాకిస్తాన్‌లోనే ఉండి వీడియోలు అప్లోడ్ చేశాడా అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విషయాలపై ఎన్ఐఏ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ కంపెనీలతో అగ్రిమెంట్

ద్విచక్ర వాహనంపై విదేశాలు తిరుగుతూ ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ని పెంచుకున్న భయ్యా సన్నీ యాదవ్ కొన్ని ప్రైవేటు కంపెనీలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడని తెలుస్తుంది. ఓ ఇంజన్ ఆయిల్ కంపెనీతో సంవత్సరానికి రూ. 50 లక్షలు అగ్రిమెంట్ కుదిరించుకున్నారని సమాచారం. బైక్ మీద విదేశాలు తిరుగుతూ తమ ఆయిల్ కంపెనీని ప్రమోషన్ చేయాల్సిందిగా ఆ అగ్రిమెంట్ సారాంశం. అలాగే కొన్ని ద్విచక్ర వాహనాలు, టైర్లు, స్పేర్ పార్ట్స్ ప్రమోషన్లు చేయాలని ఆయా ప్రైవేటు కంపెనీలతో భయ్యా సన్నీ యాదవ్ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు సమాచారం. వీటితో పాటుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసి భారీగా డబ్బులు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణహాని ఉండడంతో పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులతో ప్రస్తుతం నూతనకల్ మండల కేంద్రంలో మూడు కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ఇల్లు నిర్మిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.


Also Read..

నా కొడుకు ఆచూకీ చెప్పండి.. బయ్యా సన్నీయాదవ్ తండ్రి ఆవేదన


Next Story