నగరం నడిబొడ్డున దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-16 05:55:04  IST  )

నగరంలో ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది.

నగరం నడిబొడ్డున దారుణం.. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య
X

దిశ, వెబ్‌డెస్క్/గండిపేట: హైదరాబాద్ నగర శివారులోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి, ఆపై కిరాతకంగా హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే ఆరేళ్ల బాలిక ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రి 10 గంటల ప్రాంతంలో నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

సీసీ కెమెరా దృశ్యాలతో చిక్కిన నిందితుడు..

పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, ఓ దుండగుడు బాలికను తన వెంట తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశానని, ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నిందితుడు చూపించిన చోటే బాలిక మృతదేహం లభ్యమైంది. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై హత్య, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసిపాపపై జరిగిన ఈ అఘాయిత్యం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story