Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. మరో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ అరెస్ట్

by Kema Shiva Kumar |

ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో కీలక నిందితుడు ప్రణయ్ ప్రకాశ్‌ను నేపాల్ సరిహద్దులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. మరో నిందితుడు ప్రణయ్ ప్రకాశ్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (Liquor Scam)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో A52గా ఉన్న ప్రణయ్ ప్రకాశ్‌ను నేపాల్‌లోని సోనౌలీ చెక్‌పోస్ట్ వద్ద అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రణయ్ ప్రకాశ్‌పై ఇప్పటికే లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు.. అతడిపై నిరంతరం నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నేపాల్‌లోని సోనౌలీ చెక్‌పోస్ట్ వద్ద అతడు అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనతరం నిందితుడిని నేపాల్‌లోని మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచిన అధికారులు.. ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. ప్రణయ్ ప్రకాశ్ అరెస్టుతో ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరింది. మద్యం టెండర్లు, లైసెన్సుల మంజూరులో జరిగిన అవకతవకలపై ప్రణయ్ ప్రకాశ్‌ను విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు.

కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, మద్యం వ్యాపారులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

Next Story