హైదరాబాద్‌లో మరో ఘోర అగ్నిప్రమాదం

by Gantepaka Srikanth |

నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా బహదూర్‌పురా పరిధిలోని కిషన్‌బాగ్‌లో ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌లో మరో ఘోర అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా బహదూర్‌పురా పరిధిలోని కిషన్‌బాగ్‌లో ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక సోఫా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే భవనం అంతటా వ్యాపించాయి. సోఫా తయారీ కేంద్రంలో ముడి సరుకులు, ఫోమ్, రెక్సిన్ వంటి మండే స్వభావం గల సామాగ్రి భారీగా ఉండటంతో మంటలు వేగంగా ఎగిసిపడ్డాయి. ఆకాశమంత ఎత్తున దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక నివాసితులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో తయారీ కేంద్రంలోని సోఫాలు, ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా.

కారణం ఇంకా తెలియాల్సి ఉంది..

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. సందడి ఎక్కువగా ఉండే పాతబస్తీ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు వరుసగా జరుగుతుండటంతో అగ్నిమాపక భద్రతా నియమాలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story