అనంతగిరిలో గంజాయి కలకలం.. నలుగురు అరెస్ట్

by Bhanu |

అనంతగిరి పోలీసులుచేసిన ఆకస్మిక తనిఖీల్లో గంజాయిని కొనుగోలు చేసి, సేవిస్తూ మిగిలిన భాగాన్ని విక్రయిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్‌ అయ్యారు.

అనంతగిరిలో గంజాయి కలకలం..  నలుగురు అరెస్ట్
X

దిశ, కోదాడ : అనంతగిరి పోలీసులుచేసిన ఆకస్మిక తనిఖీల్లో గంజాయిని కొనుగోలు చేసి, సేవిస్తూ మిగిలిన భాగాన్ని విక్రయిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్‌ అయ్యారు. ఈ విషయాన్ని డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సోమవారం కోదాడ రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. వివరాల ప్రకారం, అనంతగిరి గ్రామ శివారులోని చాకలి గట్టు వద్ద నలుగురు వ్యక్తులు గంజా తీసుకుంటున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు జరిపారు.


దర్యాప్తులో ఖానాపురం గ్రామానికి చెందిన కనగాల సతీష్ వద్ద ఒక కిలో, అనంతగిరికి చెందిన షేక్ సైదాబాబు, నడిగూడెం మండలానికి చెందిన బడేటి వెంకటేష్, చెవుల శ్రీకాంత్ వద్ద తలా 300 గ్రాముల చొప్పున మొత్తం 1.9 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద మూడు సెల్‌ఫోన్లు కూడా పట్టుబడ్డాయి.

నిందితులు గత కొంతకాలంగా పరస్పర పరిచయంతో కలిసి గంజాయి కొనుగోలు చేసి సేవిస్తూ, మిగిలిన భాగాన్ని ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారానికి మిర్యాలగూడకు చెందిన గంజాయి కేసులో ఇప్పటికే నిందితుడైన భాను ప్రకాష్ అనే వ్యక్తి ప్రధానంగా సంబంధం కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

ఈ నెల 8న భాను ప్రకాష్ మల్కానగిరి నుంచి తిరిగి వస్తూ, గంజాయిని అందజేసేందుకు కనగాల సతీష్‌కు సమాచారం ఇచ్చాడు. 11వ తేదీన అనంతగిరి చాకలి గట్టు వద్ద నలుగురు అతనిని కలుసుకొని రూ.10,000కు ఒక కేజీ, రూ.3,000 చొప్పున మిగిలిన 300 గ్రాముల చొప్పున గంజాయిని కొనుగోలు చేశారు. కొంత భాగాన్ని అక్కడే రాళ్ల మధ్య దాచి, మిగిలిన గంజాయితో భాను ప్రకాష్ మోటార్‌సైకిల్‌పై అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అదే రోజు మద్యాహ్నం దాచి పెట్టిన గంజాయిని తిరిగి తీసుకునేందుకు వచ్చిన నలుగురిని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను ప్రకాష్ పరారీలో ఉన్నాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.47,500గా అధికారులు అంచనా వేశారు. ఈ ఆపరేషన్‌లో కోదాడ రూరల్ సీఐ జి. రజితారెడ్డి నేతృత్వంలో ఎస్సై నవీన్‌కుమార్, కానిస్టేబుళ్లు నిరంజన్, సతీష్, శ్రీను, నరసింహ పాల్గొన్నారు.

Next Story