కామినేని ఆస్పత్రిలో సర్జరీ చేస్తుండగా.. ‘నారాయణ’ ఉద్యోగి మృతి

by Ratna Kumari |

ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీ (క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స) చేస్తుండగా.. ఓ వ్యక్తి మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

కామినేని ఆస్పత్రిలో సర్జరీ చేస్తుండగా.. ‘నారాయణ’ ఉద్యోగి  మృతి
X

దిశ, వనస్థలిపురం : ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీ (క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స) చేస్తుండగా.. ఓ వ్యక్తి మృతి చెందడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్​ కు చెందిన నరేష్ (38) నారాయణ విద్యా సంస్థలో అకౌంట్స్ విభాగంలో డివిజనల్​ అకౌంటెంట్​గా పని చేస్తున్నాడు. ఇటీవల తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడుతూ గుండెలో నొప్పిగా ఉందంటూ.. కామినేని ఆస్పత్రికి వచ్చారు. నరేష్​ను పరిశీలించిన డాక్టర్లు.. కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీ (క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స) చేయాలని నిర్ణయించారు. సర్జరీకి రూ. 8 లక్షలు ఖర్చు అవుతుందని ముందుగానే హాస్పిటల్ యజమాన్యం చెప్పారు. రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్ ప్రాసెస్​ అనంతరం బుధవారం ఆపరేషన్ షురూ చేశారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినప్పటికీ తీవ్రమైన రక్తస్రావం (హెమరాజిక్ షాక్) కారణంగా రోగి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి

కామినేని యాజమాన్యం జూనియర్​ డాక్టర్లతో సర్జరీ చేయించి నరేశ్​ను నిండుప్రాణం తీశారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. రూ. 5 లక్షలు ఇన్సూరెన్స్​ క్లెయిమ్​ చేసుకుని.. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే నరేశ్ చనిపోయాడని కుటుంబ సభ్యులు రోధించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ.. ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వెంటనే ఎల్బీనగర్​ పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులకు సర్దిచెప్పారు. నారాయణ విద్యాసంస్థల పెద్దలు, పోలీసులు కామినేని యాజమాన్యంతో మాట్లాడుతున్నారు.

తీవ్రమైన రక్తస్రావంతోనే నరేష్​ మృతి : ఆస్పత్రి యాజమాన్యం

నరేష్​ అనే వ్యక్తి క్లిష్ట గుండె శస్త్రచికిత్స అనంతరం మృతి చెందినఠ్‌ఠ‌/ ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అయోర్టిక్ స్టెనోసిస్‌, బైకస్పిడ్ వాల్వ్‌, డైలేటెడ్ ఎన్యూరిజం వంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రధాన ధమని ఎప్పుడైనా పగిలే ప్రమాదం ఉండటంతో అత్యవసర శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ‘బెంటాల్ ప్రొసీజర్’ చేయడానికి ముందు రిస్క్‌లను కుటుంబ సభ్యులకు పూర్తిగా వివరించినట్లు ఆసుపత్రి తెలిపింది. ఇతర వైద్యుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించి, వారి సమ్మతితోనే శస్త్రచికిత్స నిర్వహించినట్లు పేర్కొంది. ఏప్రిల్ 15న శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినప్పటికీ, అనంతరం తీవ్రమైన రక్తస్రావం తలెత్తింది. ప్రామాణిక చికిత్సలు, రక్తమార్పిడి చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదని వెల్లడించింది. ఏసీఎల్​ఎస్​ (అడ్వాన్స్‌డ్ కార్డియోవాస్కులర్ లైఫ్ సపోర్ట్) మార్గదర్శకాల ప్రకారం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ రోగిని కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, వైద్యపరంగా సాధ్యమైనంత చికిత్స అందించామని ఆసుపత్రి పేర్కొంది.

Next Story