కృష్ణా నదిలో ప్రమాదం.. చేపల వేటకు వెళ్లిన మైనర్ బాలుడు గల్లంతు..

by Gugulothu.Kavitha |

గద్వాల పట్టణ శివారులోని బీడీ కాలనీకి చెందిన మైనర్ బాలుడు సలీం (14) కృష్ణానదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

కృష్ణా నదిలో ప్రమాదం.. చేపల వేటకు వెళ్లిన మైనర్ బాలుడు గల్లంతు..
X

దిశ, గద్వాల క్రైమ్: గద్వాల పట్టణ శివారులోని బీడీ కాలనీకి చెందిన మైనర్ బాలుడు సలీం (14) కృష్ణానదిలో ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించిన విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సలీం అనే బాలుడు తన స్నేహితులతో కలిసి బుధవారం మధ్యాహ్నం సరదాగా చేపల వేటకు వెళ్లాడు. అయితే వీరంతా రేకులపల్లి సమీపంలోని గుండాల జలపాతం సమీపంలోని నదిలో దిగారు. ఇక చేపలు పడుతున్న క్రమంలో సలీం కాలు జారి లోతైన ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సలీం నీటిలో మునిగి పోవడాన్ని గమనించిన స్నేహితులు, సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ, నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. కొద్దిసేపటికే సలీం పూర్తిగా నీటిలో కనుమరుగయ్యాడు.

ఇక సమాచారం అందుకున్న గద్వాల రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎస్సై శ్రీకాంత్ పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. సుదీర్ఘంగా సాగిన గాలింపు అనంతరం, గురువారం ఉదయం సలీం మృతదేహాన్ని నీటి నుంచి వెలికితీశారు. బాలుడి తండ్రి మౌలాలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాదంతో సలీం కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కన్నీరుమున్నీరయ్యారు.

Next Story