భర్తను చంపుతుండగా వీడియో కాల్లో ఎంజాయ్ చేసిన భార్య

by Dishafeatures2 |
భర్తను చంపుతుండగా వీడియో కాల్లో ఎంజాయ్ చేసిన భార్య
X

దిశ, వెబ్ డెస్క్: భర్తను తన ప్రియుడు హత్య చేస్తుండగా వీడియో కాల్ లో చూసి ఓ భార్య ఎంజాయ్ చేసింది. అనంతరం ఆ హత్యను ప్రియుడితో కలిసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. మానవ సంబంధాలకు మాయని మచ్చగా నిలిచిన ఈ ఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనా వివరాలు జగద్గిరిగుట్ట సీఐ కె.క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన టి.జయకృష్ణ (35), ఆయన భార్య టి.దుర్గా భవానీ హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట అల్విన్ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక జయకృష్ణ స్థానికంగా ఉన్న ఓ జిమ్ లో ట్రైనర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే చందానగర్ కు చెందిన చిన్నా (23) అనే జిమ్ ట్రైనర్ తో జయకృష్ణకు పరిచయం ఏర్పడింది. తక్కువ కాలంలోనే వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే చిన్నా అప్పుడప్పుడు జయకృష్ణ వాళ్ల ఇంటికి వచ్చివెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే చిన్నాకు జయకృష్ణ భార్యతో అక్రమ సంబంధం ఏర్పడింది. దాదాపు ఐదేళ్లుగా వారిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆర్థికంగా కొన్ని సమస్యలు రావడంతో జయకృష్ణ తన స్వగ్రామానికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు.


ఈ క్రమంలోనే భార్యను తీసుకొని సొంత ఊరెళ్లాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాక ఇంటిని ఖాళీ చేయడానికి తన తండ్రితో కలిసి జయకృష్ణ ఈ నెల 10న హైదరాబాద్ కు వచ్చాడు. తండ్రి బంధువుల ఇంటికి వెళ్లడంతో తన మిత్రుడైన చిన్నాకు కాల్ చేసి రమ్మన్నాడు జయకృష్ణ. దీంతో వెంటనే అక్కడ వాలిపోయిన చిన్నా.. జయకృష్ణకు బాగా మద్యం తాగించాడు. దీంతో జయకృష్ణ గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఇదే అదనుగా భావించిన చిన్నా పెట్రోల్ తీసుకొచ్చి జయకృష్ణ మీద చల్లి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. ఇక తీవ్ర గాయాలపాలైన జయకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ముందుగా జయకృష్ణది ఆత్మహత్యే అని అంతా భావించారు. కానీ భార్య దుర్గా భవానీ మీద అనుమానం రావడంతో జయకృష్ణ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా దుర్గా భవానీ తన నేరాన్ని అంగీకరించింది. తనకు తన ప్రియుడు చిన్నాకు అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే భర్తను హత్య చేయించినట్లు పోలీసులు ఎదుట ఒప్పుకుంది. ఇక తన భర్తను పెట్రోల్ పోసి నిప్పంటించేటప్పుడు చిన్నా తనకు వీడియో కాల్ చేశాడని, తాను ఫోన్ లైవ్ లో ఉండగానే భర్తకు నిప్పంటించాడని ఆమె పోలీసులకు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుర్గాభవానీ, ఆమె ప్రియుడు చిన్నాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story

Most Viewed