- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్సంపేట మహిళాకు చిక్కిన ఢిల్లీ వ్యక్తి.. రూ.2.50 కోట్లు ఫట్
నర్సంపేటకు చెందిన ఓ మహిళ నకిలీ కంపెనీ పెట్టి దేశ వ్యాప్తంగా రూ.2.50 కోట్లకు సైబర్ మోసం చేసింది.

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళ జాతీయ స్థాయి సైబర్ ఫ్రాడ్‌ను నడుపుతున్నట్టు బయటపడటం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. నర్సంపేట మండలానికి చెందిన ఈ మహిళ అకౌంట్ల నుంచి రూ.రెండున్నర కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. దీంతో దేశ రాజధాని నుంచి పోలీసులు ప్రత్యేక బృందం శనివారం నర్సంపేట చేరుకుని దర్యాప్తు చేపట్టారు. విశ్వాసనీయ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
లక్నేపల్లి టు హైదరాబాద్ పబ్
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ చాలా ఏళ్ల క్రితమే భర్తతో విడాకులు తీసుకుని తన ఇద్దరు కుమారులతో కలిసి ఉంటుంది. ఆమె కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌లో పబ్‌ను సైతం పెట్టి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆమె బ్యాంక్ అకౌంట్లకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అమౌంట్ జమ అవుతుండటం.., మళ్లీ డ్రా అవుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి సదరు మహిళపై అక్కడి పోలీసులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఓ కంపెనీలో తాను పెట్టబడులు పెట్టానని, ఆ తర్వాత ఆ కంపెనీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని ఢిల్లీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేటతో లింక్ ఉన్నట్లు తెలుసుకొని ఇక్కడికి చేరుకున్నారు.
నకిలీ కంపెనీతో రూ.కోట్లు కొల్లగొట్టి..
జమున ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పేరుతో నకిలీ కంపెనీని సృష్టించిన మహిళ వివిధ ప్రాంతాల నుంచి , రూ.2.50 కోట్లు డబ్బులు రాబట్టినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నకిలీ కంపెనీని మూసేసినట్టు సమాచారం. ఈ మహిళది నర్సంపేట మండలం లక్నేపల్లి కాగా, ఆమె ఆధార్ కార్డు అడ్రస్‌ను మాత్రం పలు దఫాలుగా హన్మకొండ, మహబూబాబాద్, వడ్డేపల్లి, హైదరాబాద్‌కు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. వివిధ అడ్రస్‌లతో వేర్వేరు బ్యాంక్ ఖాతాలు తెరిచి సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడ్డట్టు గుర్తించారు. ఆ అకౌంట్లకు వివిధ ప్రాంతాల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని, మళ్లీ వాటిల్లో నుంచి ఇతర అకౌంట్లకు బదిలీ అయినట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ కేసు దర్యాప్తునకు వచ్చిన స్పెషల్ టీంకు సదరు మహిళ పెద్ద కుమారుడు దొరికినట్టు సమాచారం. హైదరాబాద్‌లో పబ్ నడిపిస్తున్న ఆమెకు పలువురు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే ఆమె షెల్ కంపెనీ ద్వారా కోట్ల రూపాయల మోసం చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
ఆమె వెనక ఎవరున్నారు..?
ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ మహిళ వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎలాంటి నకిలీ కంపెనీ పెట్టింది? దాని ద్వారా ఎన్ని కోట్ల డబ్బులు కొల్లగొట్టింది? ఎంత మంది బాధితులు ఉన్నారు? ఆమె ఒక్కతే ఈ ఫ్రాడ్ చేసిందా..? లేక ఆమె వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే వివరాలపై సైబర్ క్రైం పోలీసులు కూపీలాగుతున్నారు. ఈ కేసుపై నర్సంపేట రూరల్ ఎస్సైని వాకబు చేయగా.. ఢిల్లీ నుండి పోలీసులు వచ్చిన మాట వాస్తవమేనని ధృవీకరించారు. కానీ వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.






