- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి పెళ్లిరోజునే మరణ శాసనం.. గొంతునులిమి గర్భిణి దారుణ హత్య
మొదటి పెళ్లి రోజునే గర్భిణిని అత్తమామ కలిసి దారుణంగా హతమార్చిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున ఆమె నూరేళ్ల జీవితంపై ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది. వివాహ వార్షికోత్సవం వేళ భర్త నుంచి ఏదో ఒక బహుమతి వస్తుందని ఆశపడిందో ఏమో కానీ, అదే రోజున ఆమె ప్రాణాలను బలి తీసుకున్న దారుణ ఘటన బిహార్ (Bihar)లోని గోపాల్‌గంజ్ జిల్లాలో వెలుగు చూసింది. అదనపు కట్నం కోసం కక్కుర్తి పడ్డ అత్తమామలు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. 3 నెలల గర్భిణి అని కూడా చూడకుండా మొదటి పెళ్లి రోజే ఆమెను సైలెంట్‌గా గొంతు నులిమి చంపేశారు.
బుల్లెట్ బైక్, గోల్డ్ చైన్ కోసం వేధింపులు..
మృతురాలు గుడియా దేవి (22)కి మనీష్ కున్వర్‌తో 2025, మే 8న వివాహమైంది. పెళ్లి సమయంలో తమ శక్తి మేరకు కట్నకానుకలు ఇచ్చినప్పటికీ, పెళ్లయిన కొద్దిరోజుల నుంచే బుల్లెట్ బైక్, గోల్డ్ చైన్ కావాలంటూ భర్త, అత్తమామలు వేధించడం మొదలుపెట్టారు. ఆమె గర్భం దాల్చిన తర్వాత ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, సరిగ్గా మొదటి వివాహ వార్షికోత్సవం రోజే అంటే శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. కట్నం డిమాండ్లు నెరవేరకపోవడంతో గుడియా దేవిని గొంతు నులిమి చంపేశారని బాధితురాలి తరపు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, ఘటన గురించి సమాచారం అందగానే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన భర్త మనీష్ కున్వర్, తల్లిదండ్రులు ఇల్లు వదిలి పరారయ్యారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. తమకు ఓ వివాహిత మరణించినట్లుగా సమాచారం అందిందని అన్నారు. ఆమె ఉరివేసుకుని చనిపోయిందని ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, మేము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఎఫ్ఎస్‌ఎల్ (FSL) బృందాన్ని పిలిపించామని అన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీస్ అధికారి రాజేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కట్న వేధింపులు, హత్యారోపణల నేపథ్యంలో పోలీసులు కేసును తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.






