- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Crime: అనాథ అని పెంచి పెద్ద చేస్తే బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తల్లిని చంపిన కసాయి కూతురు
అనాథ అని పెంచి పెద్ద చేసిన పాపానికి ఓ తల్లిని కడతేర్చింది ఓ మైనర్ బాలిక

దిశ, డైనమిక్ బ్యూరో: అనాథ అని పెంచి పెద్ద చేసిన పాపానికి ఆ తల్లినే చంపేసిందో కసాయి కూతురు. ఇద్దరు ప్రియులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింది. ఆ తర్వాత ఎలాగు తప్పించుకున్నానని భావించగా చివరకు రెండు వారాల తర్వాత ఈ బాగోతాన్ని ఇన్ స్టాగ్రామ్ పట్టించింది. మానవత్వం మంటకలిపిన ఈ ఘటన ఒడిశాలో (Odisha) చోటు చేసుకుంది. గజపతి జిల్లా పర్లాఖేముండి పట్టణానికి చెందిన రాజ్యలక్ష్మి కర్ (54)కి (Rajalaxmi Kar) 13 ఏళ్ల క్రితం రోడ్డుపై పడి ఉన్న మూడు రోజుల ఆడ శిశువు కనిపించింది. తమకు ఎలాగు పిల్లలు లేకపోవడంతో ఆ పసికందును చూసి అక్కున చేర్చుకుంది. ఆ చిన్నారిని మనమే పెంచుకుందామని భర్తను ఒప్పించింది. దాంతో తనకు ఓ కూతురు ఉందని.. ఆ చిన్నారిని అల్లారుముద్దుగా పెంచుతూ మురిసిపోయిందామే. అయితే ఆ మరుసటి ఏడాదే రాజ్యలక్ష్మి భర్త మరణించాడు. దాంతో ఏడాది వయసు కలిగిన ఆ పసిపాపతో ఒంటరిగా మారిపోయింది. అయినా ఆమె ఎక్కడా ధైర్యం కోల్పోకుండా కష్టపడి ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. కేంద్రీయ విద్యాలయంలో చదివించేందుకు పర్లాకిమిడికి వెళ్లి అక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఇప్పుడా బాలికకు 13 ఏళ్లు కాగా 8వ తరగతి చదువుతోంది.
పెద్ద వయసువారితో సంబంధం:
ఈ క్రమంలో అమ్మాయి తనకంటే చాలా పెద్ద వయసు కలిగిన రథ్ (21), సాహు (20) అనే ఇద్దరు వ్యక్తులతో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గమనించిన తల్లి రాజ్యలక్ష్మి కూతురిని మందలించింది. తల్లి తన సంబంధానికి అడ్డు వస్తున్న విషయాన్ని రథ్ కు చెప్పిందా బాలిక. దీంతో తల్లిని చంపేయాలని అలా చేస్తే మన సంబంధానికి ఎలాంటి అడ్డు ఉండదని అలాగే ఆమె ఆస్తిని కూడా దక్కించుకోవచ్చని ఆ బాలికను రథ్ బాగా నూరిపోశాడు. స్నేహితుడి మాటలతో మంచిచెడులు ఆలోచించని సదరు బాలిక గత ఏప్రిల్ 29 వ తేదీ సాయంత్రం తన తల్లికి నిద్రమాత్రలు ఇచ్చింది. ఆమె స్పృహ కోల్పోయాక రథ్, సాహులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత ముగ్గురు కలిసి రాజ్యలక్ష్మిని దిండుతో గొంతు నొక్కి హత్య చేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించి గుండెపోటు వచ్చిందని నమ్మించారు. ఆమెకు గతంలో గండె సంబంధిత జబ్బు ఉండటంతో బంధువులు సైతం ఇదే నిజం అని నమ్మి అంత్యక్రియలు పూర్తి చేశారు.
పట్టించిన ఇన్ స్టాగ్రామ్:
అయితే ఈ ఘటన జరిగిన 2 వారాల తర్వాత సదరు బాలిక మొబైల్ ఫోన్ ను రాజ్యలక్ష్మి సోదరుడు గమనించాడు. ఇందులో రాజ్యలక్ష్మి హత్యకు సంబంధించిన ప్లాన్ అంతా సదరు బాలిక రథ్, సాహులతో ఇన్ స్టాగ్రామ్ లో (Instagram) చేసిన డిస్కషన్ అంతా కనిపించింది. ఇది చూసి షాక్ తిన్న రాజ్యలక్ష్మి సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ హత్య బాగోతం అంతా వెలుగు చూసింది. దీంతో మైనర్ బాలికతో పాటు ఈ హత్యకు సహకరించిన ఆమె స్నేహితులు రథ్ దినేశ్ సాహు లను అరెస్టు చేశారు. అయితే హత్య తర్వాత రాజ్యలక్ష్మి బంగారు ఆభరణాలను ఆ అమ్మాయి తన ప్రియుడు రథ్ కు అప్పగించింది. అతను వాటిని దాదాపు రూ. 2.4 లక్షలకు తాకట్టు పెట్టగా మరో 30 గ్రాముల బంగారు ఆభరణాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. కాగా పాముకు పాలు పోసినా విషమే చిమ్మింది అన్నట్లుగా రోడ్డుపై అనాథల పడి ఉంటే తెచ్చి పెంచిన పాపానికి రాజ్యలక్ష్మి ప్రాణాలు తీసిందని ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






