దారుణం.. మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య.. అత్యాచారంపై అనుమానాలు

by Naga Rani Yarlagadda |

మదనపల్లెలోని నీరుగట్టువారపల్లిలో నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన బాలిక శవమై కనిపించింది. ఎదురింట్లో ఓ నీటి డ్రమ్ములో బాలిక మృతదేహాన్ని గుర్తించారు.

దారుణం.. మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య.. అత్యాచారంపై అనుమానాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని నీరుగట్టువారపల్లిలో నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక కథ విషాదాంతమైంది. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు వెతికినా కనిపించలేదు. ఎదురింటి వ్యక్తిపై అనుమానం కలిగి ఆ ఇంట్లో వెతకగా బాలిక మృతదేహం లభ్యమైంది. నిందితుడు బాలికను చంపి ఒక నీటి డ్రమ్ములో పెట్టి ఉంచినట్లు గుర్తించారు. నిందితుడు బాలిక మృతదేహాన్ని రాత్రంతా ఆ నీటి డ్రమ్ములోనే ఉంచాడు. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను గతంలో కూడా పలువురితో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. బాలిక హత్య ఘటనపై వన్ టౌన్ పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. నిందితుడిని పోలీసులు తమకు అప్పగించి వెళ్లాలని స్థానికులు వాగ్వాదానికి దిగారు. నిందితుడిని అప్పగించేంత వరకూ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించనివ్వబోమని పట్టుపట్టారు.

Next Story