దారుణం.. ఆడుకుంటున్న ఆరేళ్ల పాపను లాక్కెళ్లి రేప్ చేసి.. అంతటితో ఆగకుండా..

by Naga Rani Yarlagadda |

ఆరుబయట నవ్వుతూ తన తోటి చిన్నారులతో ఆడుకుంటున్న ఆరేళ్ల పాప జీవితాన్ని ఓ కామాంధుడు చిదిమేశాడు.

దారుణం.. ఆడుకుంటున్న ఆరేళ్ల పాపను లాక్కెళ్లి రేప్ చేసి.. అంతటితో ఆగకుండా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరుబయట నవ్వుతూ తన తోటి చిన్నారులతో ఆడుకుంటున్న ఆరేళ్ల పాప జీవితాన్ని ఓ కామాంధుడు చిదిమేశాడు. శనివారం (ఫిబ్రవరి 8) రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన బిహార్ లోని దర్భంగా జిల్లాలో వెలుగుచూసింది. బాలికను అక్కడి నుంచి లాక్కెళ్లిన నిందితుడు.. దారుణంగా అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశాడు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు..

శనివారం సాయంత్రం ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారి చీకటి పడినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు గాలింపు చేపట్టారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ చెరువు సమీపంలో కుక్కలు మొరుగుతుండటంతో అక్కడికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో చిన్నారి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు, సీనియర్ ఎస్పీ జగన్నాథ్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజీతో దొరికిన నిందితుడు

పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా, నిందితుడు ముగ్గురినీ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఇద్దరు పిల్లలు తప్పించుకోగా, బాధితురాలిని మాత్రం పట్టుకుని చీకటి ప్రాంతంలోకి లాక్కెళ్లాడు. తప్పించుకున్న పిల్లలు ఆ వ్యక్తిని గుర్తించారు. పోలీసులు చూపించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని వికాస్ మహతోగా పిల్లలు గుర్తించారు. నిందితుడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో అతడి దుస్తులపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కుటుంబ సభ్యుల ఆవేదన.. భగ్గుమన్న స్థానికులు

తమ బిడ్డను అత్యాచారం చేసి దారుణంగా చంపేశారని బాధితురాలి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం సుందర్‌పూర్ బేలా ఆలయం వద్ద ప్రధాన రహదారిని దిగ్బంధించారు. నిందితుడిని తమకు అప్పగించాలని ఆందోళనకారులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని . ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయని ఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ ఘటన దర్భంగాలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న పిల్లల రక్షణపై తల్లిదండ్రులు, స్థానిక యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం మరోసారి గుర్తు చేస్తోంది.

Next Story