భారత్ సిటీలో విషాదం.. కొరియన్ లవ్ గేమ్‌కు బానిసలై ముగ్గురు బాలికలు సూసైడ్

by Naga Rani Yarlagadda |

ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలై ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో జరిగింది.

భారత్ సిటీలో విషాదం.. కొరియన్ లవ్ గేమ్‌కు బానిసలై ముగ్గురు బాలికలు సూసైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆన్ లైన్ గేమ్స్ కు బానిసలై ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఓ భవనం 9వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఈ హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు బాలికలు ఆన్ లైన్ గేమ్ కు బానిసలైన క్రమంలో.. అవన్నీ మానుకోవాలని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో వారంతా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ లోని భారత్ సిటీ రెసిడెన్షియల్ టౌన్ షిప్ లో బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అందరూ నిద్రిస్తుండగా.. భవనం పైనుంచి ఏదో పడిన శబ్దం వినిపించడంతో.. స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందోనని చూడగా.. పాఖీ (12), ప్రాచి (14), విశికా (16) విగతజీవులుగా కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కుటుంబ సభ్యులను ప్రాథమిక విచారణ చేయగా వారి సూసైడ్స్ కు అసలు కారణం తెలిసింది.

వాస్తవానికి దూరంగా.. వర్చువల్ ప్రపంచంలోనే

ప్రాథమిక విచారణలో.. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రారంభమైన ఆన్‌లైన్ గేమింగ్‌పై ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు తీవ్ర ఆసక్తి ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ముఖ్యంగా ‘కొరియన్ లవ్ గేమ్’ అనే ఆన్‌లైన్ టాస్క్ ఆధారిత గేమ్‌కు వారు బాగా అలవాటు పడ్డారని వెల్లడించారు. ఈ గేమ్‌పై ఇంట్లో తరచూ వివాదాలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు. గేమ్‌లలో మునిగిపోయిన కారణంగా స్కూల్‌కు కూడా వెళ్లడం మానేశారని చెప్పారు. వర్చువల్ ప్రపంచంలోనే ఎక్కువ సమయం గడుపుతూ వాస్తవ జీవితానికి దూరమయ్యారని అధికారులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతోంది.

‘కొరియన్ లవ్ గేమ్’ అంటే ఏమిటి?

‘కొరియన్ లవ్ గేమ్’ అనేది ఒక రకమైన ఆన్‌లైన్ చాట్ గేమ్. ఇందులో అవతలి వ్యక్తి తాను కొరియా లేదా విదేశానికి చెందిన యువకుడు/యువతిగా పరిచయం చేసుకుంటూ మాట్లాడటం మొదలుపెడతాడు. ఈ గేమ్ ప్రధానంగా సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

మొదట స్నేహం, ప్రేమ పేరుతో మాటలు మొదలవుతాయి. నమ్మకం పెంచేందుకు సులభమైన పనులను అప్పగిస్తారు. ఆ తర్వాత క్రమంగా క్లిష్టమైన పనులను చేయమంటారు. మానసిక ఒత్తిడి పెంచుతూ బెదిరింపులకు కూడా దిగుతారు. చెప్పినట్లు చేయకపోతే ఇబ్బందులు పెడతామని హెచ్చరిస్తారు. దీని వల్ల బాధితులు తీవ్ర ఒత్తిడికి గురవుతారని, ఫలితంగా వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Next Story