దారుణం.. ఇంట్లో తల్లిదండ్రుల కళ్లెదుటే ఐదేళ్ల బాలుడి హత్య

by Naga Rani Yarlagadda |

తల్లిదండ్రుల కళ్లెదుటే ఐదేళ్ల బాలుడు సొంతింట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జరిగింది.

దారుణం.. ఇంట్లో తల్లిదండ్రుల కళ్లెదుటే ఐదేళ్ల బాలుడి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: తల్లిదండ్రుల కళ్లెదుటే ఐదేళ్ల బాలుడు సొంతింట్లో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో జరిగింది. ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని గ్రామస్తులు వెంటాడి పట్టుకుని, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు మహేష్ మాడ (24)కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ఎస్పీ మయాంక్ అవస్థి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మహేష్ మూడ్రోజులుగా గ్రామంలో కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మూడ్రోజులుగా ఒంటరిగా తిరుగుతున్న మహేష్.. అకస్మాత్తుగా ఓ ఇంట్లోకి ప్రవేశించి.. మంచంపై కూర్చుని ఉన్న బాలుడిపై పదునైన ఆయుధంతో దాడిచేశాడని, విచక్షణా రహితంగా పొడవడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. మహేష్ ను చూసిన వెంటనే బాలుడి తల్లిదండ్రులు ఎవరు నువ్వు అని అడగ్గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాడిచేసినట్లు చెప్పారు. వాళ్ల కేకలు విన్న గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని ఆగ్రహంతో చితకబాదడంతో మహేష్ కు తీవ్రగాయాలయ్యాయని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. మరోవైపు మహేష్ కుటుంబ సభ్యులు అతనికోసం వెతుకుతున్నట్లు తెలిపారు. కాగా.. గతంలోనూ మహేష్ ఇలాంటి దాడులకు పాల్పడినట్లుగా తెలిసిందని, బహుశా అతనికి మతిస్థిమితం సరిగ్గా లేదని అనుమానం వ్యక్తం చేశారు. బాలుడి హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిఘా ఉంచారు.

Next Story