- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబాలా బోరుబావి విషాదం: 21 గంటల పోరాటం వృధా.. నాలుగేళ్ల బాలుడు మృతి!
హర్యానాలో 220 అడుగుల బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలుడు 21 గంటల రెస్క్యూ తర్వాత మృతి.. ఆసుపత్రికి తెచ్చేసరికే చనిపోయినట్లు గుర్తింపు!

దిశ, వెబ్ డెస్క్: బోరుబావిలో పడిపోయిన నాలుగేళ్ల చిన్నారి కథ విషాదంగా ముగిసింది. హర్యానా రాష్ట్రం అంబాలా జిల్లాలోని ధనౌరా గ్రామంలో మంగళవారం ఉదయం చిన్నారి బోరుబావిలో పడిపోగా.. సుమారు 21 గంటల పాటు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి జరిపిన భారీ సహాయక చర్యల అనంతరం బుధవారం తెల్లవారుజామున 3:40 గంటలకు బాలుడిని బయటకు తీశారు. అయితే, బాలుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన చిన్నారిని నిర్వైర్ సింగ్‌గా గుర్తించారు.
నీరు చేరడంతో ఊపిరాడక ప్రాణాలు విడిచిన చిన్నారి..
బాలుడు పొలంలో ఆడుకుంటూ సుమారు 220 అడుగుల లోతైన తెరిచి ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. సుమారు 60 అడుగుల లోతు నుండి బోరుబావిలోకి నీరు ఊరడం ప్రారంభం కావడంతో చిన్నారి క్రమంగా నీటిలో మునిగిపోయాడు. దీనికి తోడు అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల మట్టి కుప్పలు పడటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలిగింది. తీవ్ర శ్రమించి బాలుడిని బయటకు తీసి అంబులెన్స్‌లో అంబాలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగానికి తీసుకువచ్చేసరికే బాలుడు చనిపోయాడని సివిల్ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రిషి పాల్ సింగ్ ధృవీకరించారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా బోరుబావిని తెరిచి ఉంచిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






